విలువలెందుకు.. స్వామిభక్తి చాలు..

‘దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. పరమ నీతిమంతుడు.. అప్పటివరకు దేశవిఖ్యాతి పొందిన చంద్రబాబు అడ్డంగా బుక్ అయిన వేళ.. కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఏపీ సీఎం చంద్రబాబు అల్లాడుతున్న సమయం.. కానీ తరువాత అంతా సద్దుమణిగింది. కేసీఆర్ తన గురుదక్షిణగా చంద్రబాబును ఈ కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ దీనివెనుక ఉన్న హస్తం మాత్రం మన గవర్నర్ నరసింహన్ అని ఇన్ సైడ్ టాక్.. ఈయనే కేసీఆర్ తో రాజీ కుదిర్చి ఈ అతిపెద్ద రాజకీయకుట్ర బాంబును పేలకుండా.. తెలుగు రాష్ట్రాల పరువు పోకుండా మధ్యవర్తిత్వం వహించాడనేది అంతర్గత రహస్యం.. ఆ తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గంలోకి ఇతర పార్టీ నేతలను ఫిరాయింప చేసి మంత్రి పదువులు ఇప్పించినా నరసింహన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. అందుకే ఆ తర్వాత ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా సరే.. తమను ఆపదల్లో ఆదుకున్న నరసింహన్ వైపే ఇద్దరు సీఎంలు మొగ్గు చూపారు. మరోసారి గవర్నర్ పదవిని నరసింహన్ కే ఇప్పించారు.
 ఏదీ నీతి.. నిజాయితీ..

రాజకీయాల్లో నీతి నిజాయితీ కరువైంది. తమిళనాట రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును ఉపయోగించుకున్న తీరు చూశాక.. రాజకీయ పండితులందరూ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కొనసాగడం లేదని దుమ్మెత్తిపోశారు. విమర్శకులు ఎన్ని విమర్శలు చేసినా కూడా మోడీ తన రాజకీయ క్రీడను తమిళనాడులో ఆడి శశికళను విజయవంతంగా జైలు కు పంపారు. ఇక్కడాఅదే కథ.. తమకు అనుకూలురు.. ఇరు రాష్ట్రాల సీఎంల గుట్టు మట్లు తెలిసి ఎప్పటికప్పుడు తమకు నివేదికల రూపంలో పరిస్థితులను వివరిస్తున్న కాంగ్రెస్ హయాంలో నియమితుడైన గవర్నర్ నరసింహన్ ను వదిలించుకోవడానికి ప్రధాని మోడీ సాహసం చేయలేదు. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాదిలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కట్టడి చేయడంలో.. వారి గుట్టుమట్లు రహస్యంగా చేరవేసే దమ్మున్న గవర్నర్ ప్రస్తుతం మోడీ చేతిలో లేరు. అందుకే అన్నీ తెలిసి గత ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలను, కేసీఆర్, చంద్రబాబు లూప్ హోల్స్ ను అన్నీ తెలిసిన నరసింహన్ ను కొనసాగించేందుకే మోడీ నిర్ణయించారు. అందుకే గవర్నర్ పదవి కాలం ముగిసినా రాష్ట్రపతి ఎన్నికవరకు కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.
· గవర్నర్ తీరు వివాదాస్పదం..

గవర్నర్ నరసింహన్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే.. ఈయన దైవారాదన ఆదినుంచి విమర్శలకు తావిచ్చింది.. నెలకూ రెండు నెలలకోసారి తిరుమల సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తూ తన అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. వైసీపీ, టీడీపీ నుంచి గెలిచిన వారికి ఏపీ, తెలంగాణల్లో మంత్రివర్గంలోకి చోటిచ్చి గవర్నర్ రాజ్యాంగాన్ని కూనీ చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. వైసీపీ అధినేత జగన్, టీడీపీ నేత రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇతర పార్టీల నేతల ప్రమాణ స్వీకారంపై గవర్నర్ కు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేశారు. ఇంత రచ్చ జరిగినా గవర్నర్ స్వామి భక్తిని ప్రదర్శించడం విమర్శలపాలైంది.
విభజన సమస్యలు పట్టని గవర్నర్:

విభజన సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాలను పట్టి పీడించాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. నీళ్లు, ఉద్యోగ నియామకాలు, ఆస్తులు, నిధులు పంపకాల్లో ఎన్నో సార్లు గొడవలు జరిగినా భీష్మ పీతామహుడిలా నరసింహన్ ప్రేక్షక పాత్ర పోషించాడనే విమర్శలున్నాయి. కొన్ని సందర్బాల్లో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యాడు. ఏపీ సీఎం సిఫారసు చేసిన కొన్ని బిల్లులకు మోకాలడ్డాడు. తెలంగాణ సీఎం ఆమోదించిన పలువురు ఎమ్మెల్సీలకు నో చెప్పాడు. అడపాదడపా మాత్రమే గవర్నర్ పాత్రను పోషించి మిగతా సందర్బాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునే పాత్రలోనే ఒదిగిపోయారు. అందుకే ఇలా అందరికీ సహకారం అందిస్తూ వచ్చిన నరసింహన్ దిగిపోయే టైం వచ్చే సరికి సీఎం కేసీఆర్ లాబీయింగ్ నెరిపారు. ఢిల్లీకి ఇటీవల వెళ్లిన కేసీఆర్.. నరసింహన్ రెన్యూవల్ ను దిగ్విజయంగా పూర్తిచేశారు.

ఇలా ఇన్ని వివాదాలు, ఇంత విమర్శలు వచ్చినా సరే ప్రధాని మోడీ ఈ కాంగ్రెస్ అనుకూల పెద్దమనిషికే ఓటేశాడు. ఎందుకంటే ఇంతకంటే స్వామి భక్తి ప్రదర్శించే వ్యక్తి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ప్రస్తుతానికి మోడీ చేతిలో లేరు. రాష్ట్రపతి ఎన్నిక ముగిశాక సమర్థులు దొరికతే గవర్నర్ నరసింహన్ మారుతారు.. లేదంటే ఇలానే లాబీయింగ్ చేసి మరో సారి ఎన్నికవుతారు..

కొసమెరుపు : గవర్నర్ నరసింహన్ సీనియర్ ఐపీఎస్ అఫీసర్.. గతంలో కాంగ్రెస్ హయాంలో దేశ ఇంటెలిజన్ ఐజీ చీఫ్ గా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే జాతీయ భద్రత సలహాదారుగా నియమించుకున్న అజిత్ దోవల్ కు క్లాస్ మేట్ నరసింహన్.. ఇద్దరూ కలిసి ఐబీలో కీలక హోదాల్లో పనిచేశారు. అజిత్ తో పాటు నరసింహన్ కూడా కీలక అధికారే.. అందుకే అజిత్ సిఫారసు మేరకే  గవర్నర్ గిరి నరసింహన్ కు మరోసారి దక్కిందనే వార్తలు వెలువడుతున్నాయి.

To Top

Send this to a friend