వైసీపీలో కొత్త ఇష్యూ..

వైసీపీలో కొత్త ఇష్యూ: ఆ ఇద్ద‌రికీ అందుకే ఎంపీ సీట్లు ఇవ్వ‌లేదా : కేంద్రంలో ఛాన్స్ వారికే.!

వైసీపీలో కొద్ది రోజులుగా ఒక అంశం పార్టీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. పార్టీలో కీల‌క‌మైన ఇద్ద‌రు నేత‌ల‌కు తాజా ఎన్నిక‌ల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వ‌లేదు. వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం కల్పించారు. దీనికి స్థానికంగా ఉన్న కార‌ణాల‌నే చెబుతున్నా..టిక్కెట్ రాని నేత‌ల అనుచ‌రులు మాత్రం మ‌రో ర‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఇది నిజ‌మేనా..లేక త‌మ నేత‌ల‌కు టిక్కెట్ రాలేద‌నే కార‌ణంతో ఇలా చెబుతున్నారా అనే చ‌ర్చ సాగుతోంది.

ఆ ఇద్ద‌రికీ టిక్కెట్లు ఇవ్వ‌లేదు..

తాజా ఎన్నిక‌ల్లో పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు టిక్కెట్లు నిరాక‌రించారు. వారి స్థానంలో టీడీపీ నుండి వ‌చ్చిన నేత‌ల‌కు టిక్కెట్లు ఖ‌రారు చేసారు. వారు వైసీపీ నుండి అభ్య‌ర్దులుగా పోటీలో ఉన్నారు. ఒంగోలు..నెల్లూరు నుండి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి..మేక‌పాటి రాజ‌మోహ‌న రెడ్డి కి ఈ ఎన్నిక‌ల్లో సీట్లు ఇవ్వ‌లేదు.టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి..ఆదాల ప్ర‌భాక‌ర రెడ్డికి సీట్లు కేటాయించారు. సుబ్బారెడ్డి త‌న‌కు సీటు ఇవ్వ‌క‌పోవ‌టం పైన అసంతృప్తి వ్య‌క్తం చేసారు. నెల్లూరు విష‌యంలో మాత్రం మేక‌పాటి రాజ‌మోహ‌న‌రెడ్డి త‌న‌కు సీటు ఇవ్వ‌క‌పోవ‌టం పైన ఎక్క‌డా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఆయ‌న సోద‌రుడు..కుమారుడికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వ‌టంతో..ఆయ‌న‌కు ఈ సారి సీటు ఇవ్వ‌లేన‌ని పార్టీ స్ప‌ష్టం చేసింది. అయితే, ఇప్పుడు వారిద్ద‌రితో పాటుగా ఎంపీగా ఎన్న వ‌ర‌ప్ర‌సాద్‌ను సైతం ఈ సారి ఎమ్మెల్యేగా బరిలోకి దించారు. ఈ నిర్ణ‌యాల వెనుక భ‌విష్య‌త్ వ్యూహం ఉంద‌నే చ‌ర్చ కొద్ది రోజులుగా పార్టీలో కొన‌సాగుతోంది.

కేంద్ర ప్ర‌భుత్వంలో చేరితే..

కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాద‌నే అంచ‌నాలో వైసీపీ ఉంది. కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వానికి వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంద‌ని న‌మ్ముతున్నారు. అయితే, ఏపీకీ హోదా ఇస్తేనే తాము ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. దీంతో..వైసీపీ మ‌ద్ద‌తు కావాలంటే ఖ‌చ్చితంగా కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఏపీకీ హోదాకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవాల్సిందే. అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంలో వైసీపీకి అవ‌కాశం క‌ల్పిస్తే మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. వైసీపీ నుండి సీనియ‌ర్ ఎంపీలుగా ఉన్న వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఇదంతా అంచ‌నా వేసే ముందుగానే ఎంపీల విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని పార్టీలో కొంద‌రు విశ్లేషిస్తున్నారు. టిక్కెట్లు రాని నేత‌లు అనుచ‌రులు చెబుతున్న‌ట్లుగా అదే జ‌రిగితే ప్ర‌స్తుతం వైసీపీలో సీనియ‌ర్ ఎంపీలు లేరు. రెండో సారి ఎంపీలుగా అవినాశ్ రెడ్డి, మిధున్ రెడ్డి మాత్ర‌మే ఉంటారు.

జ‌గ‌న్ చూపు వారిపైనే..

వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్న‌ట్లుగా కేంద్రంలో వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డితే..ఆ ప్ర‌భుత్వంలో చేరి జాతీయ స్థాయిలోనూ వైసీపీ బలం పెంచుకోవాల‌నేది ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అందులో భాగంగా అవ‌కాశం వ‌స్తే కేంద్ర కేబినెట్‌లోనూ మంత్రులుగా చేర‌టానికి సిద్దం కావాల‌ని వ్యూహ‌క‌ర్త సూచించిన‌ట్లు స‌మాచారం. మంత్రులుగా కేంద్రంలో అవ‌కాశం వ‌స్తే పార్టీ నుండి జ‌గ‌న్‌కు విశ్వాస పాత్రుడుగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డితో పాటుగా మ‌రో విధేయుడు..మిధున్ రెడ్డికి అవకాశం ఇస్తార‌ని చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే సుబ్బారెడ్డికి ఇప్ప‌టికే జ‌గ‌న్ ఏం చేసేదీ స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్‌గా అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. ఇక‌, మేక‌పాఇ కుటుంబం నుండి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్య‌త ఇస్తార‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఈ చ‌ర్చ వైసీపీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

To Top

Send this to a friend