ప్రశ్నలెన్నో.. కేసీఆరే సమాధానం చెప్పాలి..

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి లేదు. మీడియాను నియంత్రించేశాడు. అసమ్మతులను పార్టీలో కలిపేసుకున్నాడు. లొల్లి చేసే వాళ్లను నయానో భయానో పీచమణించేశాడు.  వ్యతిరేకులకు తెలంగాణలో చోటే లేకుండా చేస్తున్నారు.   బంగారు తెలంగాణా ఏమైందంటూ ప్రశ్నించే శక్తిమంతులిక్కడ ఎవ్వరూ లేకపోవచ్చు. కానీ.. ఇక్కడ బతుకు జట్కాబండ్లు మాత్రం బండకొట్టినట్లు కదలనంటున్నయ్. కడుపులు మాడుతున్నయ్. పిడికిళ్లు బిగుసుకుంటున్నయ్. ఎక్కడేసిన గొంగళ్లు అక్కడే వుండిపోతే. అభివృద్ధి ఫలాలు మాత్రం ప్రగతిభవన్ దాటి బైటికి రానంటున్నాయ్.

కొత్త రాష్ట్రమొచ్చి రెండున్నరేళ్లు దాటింది. మూడో క్యాలెండర్ కూడా రేపోమాపో చిరిగిపోతోంది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి కాకుండా చూసుకుందామన్న కేసీఆర్ మాటల్ని మనసావాచా నమ్మి కోటి ఆశలతో ఆ కేసీఆర్ నెత్తినే కిరీటం తొడిగింది తెలంగాణా జనాభా. అయితే.. అంత గొప్ప నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతవరకు జస్టిఫై చేసుకున్నారు..? కోటి ఆశల్లో కనీసం కొన్నయినా తీర్చగలిగారా..? తిరుమల దేవుడికి ఐదు కోట్ల బరువైన బంగారు వస్తువులిచ్చి మొక్కు తీర్చుకున్న కేసీఆర్.. జనం చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు ఏమైపోయ్యాయన్న ఆత్మవిమర్శ చేసుకున్నారా..?

కేసీఆర్ సార్ కు అంకితం అంటూ.. దాదాపు పాతిక ప్రజాసమస్యలతో పొడవాటి చిట్టా ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఎన్నికలకు ముందటిరోజుల్లో కేసీఆర్ చేసిపెడతానన్న పనులన్నీ ఏకరువు పెట్టి.. ఇందులో ఏది ఎంతవరకొచ్చిందంటూ నిలదీస్తోంది నెటిజన్ జనాభా. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనతో మొదలుపెట్టి.. సింగరేణి వారసత్వ ఉద్యోగాల దాకా అన్నీ ఆ జీవో కాగితం దాటి కిందకు రానిబాపతేగా ? సొంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటవ్వడాన్నే ఒక సంబరంగా జరుపుకున్నాం తప్పిస్తే..  దాన్నుంచి ఊడిపడ్డ ఉద్యోగాలెన్నన్న ఖచ్చితమైన లెక్క ప్రభుత్వం దగ్గర లేనేలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్జీలు కోట్లు దాటిపోతే. వాటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ సాధ్యాసాధ్యాల మధ్యనే ఊగిసలాడుతోంది. మహిళాదినోత్సవం ఘనంగా జరుపుకోమంటూ ఆదేశాలివ్వడాలే తప్ప.. తన క్యాబినెట్లో ఒక్క మహిళకైనా చోటివ్వకపోవడంలో మర్మమేంటో చెప్పలేరు. కరీంనగర్ ని ప్యారిస్ నగరానికి దీటుగా మారుస్తామని, హైదరాబాద్ లో  స్కైవేలు కట్టిపెడతామని ఆయనన్న మాటల్ని రీకాల్ చేసుకోమని కూడా ఎవ్వరూ అడగరు. ఎందుకంటే.. వాటితో ఇప్పుడప్పడే అవసరాల్లేవు. కాలే కడుపులు, రానంటున్న కొలువులు. ఇటువంటివే ఇక్కడ అత్యవసరాలు.

ఒంటిచేత్తో శాసించడం, ప్రశ్నించడాన్ని సహించలేకపోవడం, ప్రతిఘటనను అణచివేయడం.. ఇది మాత్రమే కేసీఆర్ ఎంచుకున్న పాలసీ. నరహంతకుడు నయిూమ్ ని మట్టుబెట్టిన హీరోయిజం.. ఆ నయిూమ్ కేసును మూసి పెట్టడంలో ఏమయ్యింది.? ప్రభుత్వ పరువును మంటగలిపిన ఎమ్ సెట్ లీకేజ్ వ్యవహారాన్ని తేలిగ్గా ఎందుకు తీసుకున్నారు.? మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఫండింగ్ లో కమిషన్లు దండుకున్నారన్న ఆరోపణల మీద దర్యాప్తులెందుకుండవు? ఇవన్నీ అడగాలనుకుంటున్న సూటి ప్రశ్నలు. ఐతే.. ఆధారాల్లేకుండా ఆరోపిస్తే జైల్లో తోస్తామంటూ చూపుడువేలితో హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆ తెగింపు కూడా జనమిచ్చిన తీర్పుతో వచ్చిందేగా ! అటువంటి గొప్ప ప్రజాతీర్పును కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నది ఇప్పుడు పడిపోతున్న అభియోగం.

అప్పుడు ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన కోదండరామ్ గానీ.. ఉస్మానియా విద్యార్థి లోకం గానీ..  మిగతా ప్రజాసంఘాలు గానీ.. ఇప్పుడు ప్రభుత్వంతో పూర్తిగా విభేదిస్తున్న పరిస్థితి. అప్పుడు పరాయిపాలనపై బిగించిన పిడికిళ్లే ఇప్పడు కేసీఆర్ పాలన మీదకీ దండెత్తడమంటే.. దీన్ని జనాగ్రహం కిందకి జమ కడితే తప్పవుతుందా..? ఈ ఆవేశాలు, ఆక్రోశాల వెనక్కూడా రాజకీయ లబ్ది మాత్రమే వుందంటూ అనుమానించడం కేసీఆర్ లాంటి ఉద్యమచరిత్రకారుడికి అతుకుతుందా..? ప్రజాఉద్యమాన్ని నడిపించినప్పటి అనుభవం.. ప్రభుత్వాన్ని నడపడంలో పనికిరాకుండా పోయిందా..? ప్రజల మధ్య తిరిగి ప్రజల కష్టనష్టాన్ని చదువుకున్న కేసీఆర్..  ఒక ప్రభుత్వానికి అధినేతగా ఆ ప్రజల పక్షాన నిలబడ్డంలో విఫలమవుతున్నారా..? మిగతా రెండేళ్ల పరిపాలనలో తను పూర్తిచెయ్యాల్సిన ప్రజాపనులు ఫలానా అంటూ కేసీఆర్ రాసిపెట్టుకున్నారా..? లేక. ముక్కుసూటిగానే నడిచెళ్లిపోతారా..?

To Top

Send this to a friend