శరవేగంగా పతనమవుతోన్న టీఆర్ఎస్


తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ శరవేగంగా పడిపోతుందా? ఇదే వేగంతో పతనమైతే ఎన్నికల నాటికి గులాబీ పార్టీ స్థానం ఎక్కడుంటుంది? అత్తెసరు మార్కులతో అధికారంలోకి వచ్చి…ఉప ఎన్నికల్లో అప్రతిహత విజయాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్ ప్రభ క్రమంగా మసకబారుతోందా? ఇటీవల ఎన్నికల ఫలితాలను సునిశితంగా విశ్లేషిస్తే కారు పార్టీ స్పీడుకు జనం గట్టి బ్రేకులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో 36 శాతం ఓట్లతో అధికార పీఠం ఎక్కిన గులాబీ అధినేత కేసీఆర్ ఆ తర్వాత జరిగిన వరంగల్ పార్లమెంట్, నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికలతో తన గ్రాఫ్ ను కాస్త అటు ఇటుగా 60 శాతానికి పెంచుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా కనిపించారు. దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న సహజమైన భావనకు వివిధ వర్గాలు వచ్చాయి. అయితే…ఇటీవల జరిగిన పలు స్థానిక సంస్థల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే టీఆర్ఎస్ కు ప్రమాద గంటికలు మోగుతున్నాయన్న విషయం అర్థమవుతోంది. ఏ అధికార పక్షానికైనా మొదటి రెండున్నరేళ్లు అద్భుతంగానే ఉంటుంది. మలి రెండున్నరేళ్లలో గ్రాఫ్ ఎలా ఉండబోతోందన్నదే కీలకం. ఈ నేపథ్యంలో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే…టీఆర్ఎస్ బలం ఎలా వీగిపోతుందన్నది అర్థమవుతుంది.

ఫలితాలు…ఓ విశ్లేషణ
ఇటీవల జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేచిద్దాం. టీఆర్ఎస్ బల పరిచిన కాటేపల్లి జనార్దన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత కింద 7,640 ఓట్లు వచ్చాయి. అంటే పోలై చెల్లిన ఓట్లలో ఇది 39.5 శాతం. మిగతా పక్షాలకు అందరికీ కలిపి 11,698 ఓట్లు పోలయ్యాయి. ఇది మొత్తం చెల్లిన ఓట్లలో 60.50 శాతం. దీనిని బట్టి విపక్షాల మధ్య ఓట్లు చీలికతో టీఆర్ఎస్ లబ్దిపొందిందన్న విషయం అర్థమవుతోంది. దీని కంటే అత్యంత కీలకమైన విషయం మరొకటి ఇందులో ఇమిడి ఉంది. పలు అసెంబ్లీ, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిపి 40 శాతం ఓట్లు పొందితే…ఒక్క టీఆర్ఎస్ కే 60 శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు రివర్స్ అయింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ పరిధిలో 45 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయి.

సో…ఏడాది క్రితం 60 శాతం ఓట్లతో అప్రతిహతంగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం తాజాగా 39.5 శాతానికి పడిపోయింది. రాజకీయాల్లో ఒక సారి పతనం ప్రారంభమైతే అది పాతాళానికి దారితీస్తుందన్నది చరిత్ర. టీచర్స్ ఎమ్మెల్సీనే కాదు ఇటీవల 15 ఎంపీటీసీలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది టీఆర్ఎస్ గెలిస్తే, ఏడు స్థానాలు విపక్షాలు గెలిచాయి. ఓట్ల విషయానికి వస్తే టీఆర్ఎస్ కు 10,500 వస్తే…మిగతా ఏడు స్థానాలు గెలిచిన విపక్షాలకు 12,500 పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్షాల మధ్య చీలిక టీఆర్ఎస్ కు కలిసివచ్చింది.

సాధారణ ఎన్నికల్లో సహజంగానే పొత్తులు ఉంటాయి. సాధ్యమైనంతమేర ఓట్లు చీలకుండా పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇదంతా ఒక ఎత్తు…టీఆర్ఎస్ గ్రాఫ్ 60 శాతం నుంచి 39.5 శాతానికి పడిపోయిందన్నది ఇక్కడ గమనార్హమైన అంశం.

To Top

Send this to a friend