కేసీఆర్ పై రెడ్డిల కోపం.. ఎందుకు.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా ఇప్పుడు తెలంగాణను చూసుకున్నా తరతరాలుగా రెడ్డి నాయకుల ఆధిపత్యం కొనసాగేది. కానీ గడిచిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో వెలమ సామాజికవర్గ కేసీఆర్, ఏపీలో కమ్మ సామాజికవర్గ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టారు. దీంతో అప్పటివరకు పీసీసీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా.. ఇప్పటికీ పెద్ద పోస్టుల్లో కొనసాగుతున్న రెడ్డీలు ఇటు కేసీఆర్ ను, అటు చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రాల్లో మెజార్టీ సంఖ్యలో ఉన్న రెడ్డీలకు అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ రెడ్డీలందరూ అన్యాయమైపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో రెడ్డీల సంఖ్య ఎంత..? కేసీఆర్ నిజంగానే రెడ్డీలను దూరం పెడుతున్నారా తెలుసుకుందాం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 58 ఏండ్ల చరిత్రలో 31 సంవత్సరాలు రెడ్డి నాయకులు పాలించిండ్రు. మొత్తం 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా అందులో తొమ్మిది మంది రెడ్డి ముఖ్యమంత్రులు. రాష్ట్రపతి పాలన పోను మిగితా 26 ఏండ్లు ఇతర కుల ముఖ్యమంత్రులు పాలించినా… ఆ ప్రభుత్వాల్లోనూ రెడ్డి నాయకుల ఆధిపత్యమే కొనసాగింది. ఈ సమయంలో ప్రతిపక్షంలోనూ వారే ఉన్నరు.

చరిత్ర ఇట్ల ఉంటే, కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి రెడ్డి కులస్తులకు అన్యాయం జరిగిందని కొంత మంది ప్రచారం మొదలు పెట్టిండ్రు. నిజానికి, తెలంగాణ రాష్ట్రంలోనూ రెడ్డి నాయకులు మంచి అవకాశాలు పొందిండ్రు. తెలంగాణలో 119 మంది శాసనసభ్యుల్లో 42 మంది రెడ్లు ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రులున్నరు. వారిలో మూడో వంతు అంటే ఆరుగురు రెడ్డి మంత్రులున్నారు. 40 మంది సభ్యులున్న శాసన మండలిలో 15 మంది రెడ్డి ఎమ్మెల్సీలు ఉన్నరు. సుమారు 40 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉండగా అందులో 15-20 చైర్మన్ పదవులు రెడ్డి నాయకులకే దక్కినయ్ .

పార్లమెంటులోనూ రెడ్డి నాయకుల సంఖ్య బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా అందులో ఆరు స్థానాల నుంచి రెడ్ఠి నాయకులు ఎన్నికైండ్రు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చనిపోయే నాటికి రాజ్యసభ సభ్యునిగానే ఉన్నడు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వంటి పదవులతోపాటు ప్రభుత్వంలోని ఇతర అవకాశాలు కూడా రెడ్డి కులస్తులకు దక్కినయ్ . ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ రెడ్లదే ఆధిపత్యం కొనసాగుతుంది. కేసిఆర్ కుటుంబం ఆధీనంలో నడుస్తున్న మూడు మీడియా సంస్థల్లో, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మన టివిలోనూ రెడ్డి కులస్తులకే పెద్ద పీటలు దక్కినయ్ .

ముఖ్యమంత్రి కుర్చీలో కేసిఆర్ ఉన్నా ఆయన చుట్టూ బలంగా రెడ్డి నాయకులే ఉన్నారు. అవకాశాలను వారే పొందుతున్నారు. ఆధిపత్యమూ వారే కొనసాగిస్తున్నారు. అయినా అసంతృప్తి! అధికార పార్టీలో ఉన్నవారిలోనూ అసంతృప్తి! ప్రతిపక్షంలో ఉన్నవారిలోనూ అసంతృప్తి!
మరి దేనికోసమో ఈ అసంతృప్తి…?

To Top

Send this to a friend