నిజంగా రవితేజకు పవన్‌ ఫోన్‌ చేశాడా?


రవితేజ సోదరుడు భరత్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెల్సిందే. భరత్‌ అంత్యక్రియలకు రవితేజ మరియు అతడి కుటుంబ సభ్యులు వెళ్లక పోవడంతో వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఈ విషయమై సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి. రవితేజ, భరత్‌ మద్య ఉన్న విభేదాల కారణంగా సోదరుడి అంత్యక్రియలకు మాస్‌ రాజా హాజరు కాలేదు అనే వార్తలు గుప్పుమన్నాయి. అదే సమయంలో రవితేజకు పవన్‌ స్వయంగా ఫోన్‌ చేసి తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కావాలని సూచించాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

పవన్‌ ఇలాంటి విషయాల్లో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తాడు. అలాంటిది పవన్‌ ఫోన్‌ చేసి రవితేజతో మాట్లాడటమే ఎక్కువ. అది కాకుండా తమ్ముడి అంత్యక్రియలు దగ్గరుండి చేయమని రవితేజకు పవన్‌ చెప్పాడు అంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. పవన్‌ ఈ విషయమై అసలు స్పందించలేదు. కనీసం ఈ వార్త పవన్‌కు తెలిసిందో లేదో అని కొందరు మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు. పవన్‌ యాంటీ ఫ్యాన్స్‌ కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల సోషల్‌ మీడియాలో ఇలాంటి కథనాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు తప్పుడు వార్తలను కొందరు పబ్లిష్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిణామాలు మంచిది కాదని, ఇది ఎంత మాత్రం హర్షనీయం కాదని సినీ వర్గాల వారు మరియు పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. చావును కూడా ఇలా చెత్త ప్రచారం కోసం వాడుకోవడం దిగజారుడుతనంగా భావించాలన్నారు.

To Top

Send this to a friend