రానా-తేజ కాంబినేష‌న్‌లో `నేనే రాజు – నేనే మంత్రి`

 

 

స‌రికొత్త క‌థ‌ల్ని, ఊహ‌కు అంద‌ని పాత్ర‌ల్నీ ఎంచుకొంటూ… త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు రానా. `బాహుబ‌లి`లో భ‌ళ్లాల‌దేవ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌శంస‌లు అందుకొన్న రానా… `ఘాజీ`లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలోనూ త‌న‌దైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కుల ద‌గ్గ‌ర మార్కులు కొట్టేశాడు. అంతే కాదు… త‌న మార్కెట్‌నీ అంత‌కంత‌కూ విస్త‌రించుకొంటున్నాడు. తాజాగా.. తేజ ద‌ర్శ‌క‌త్వంతో రూపుదిద్దుకొంటున్న `నేనే రాజు – నేనే మంత్రి`పైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో జోగేంద్ర‌గా మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించుకోబోతున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా.. అని ఎప్పుడైతే ప్ర‌క‌ట‌న వెలువ‌డిందో, అప్ప‌టి నుంచీ ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది చిత్ర‌సీమ‌. ఇప్పుడు చిత్రీక‌ర‌ణ సైతం తుది ద‌శ‌కు చేరుకొంది. ఈ చిత్రానికి `నేనే రాజు నేనే మంత్రి` అనే టైటిల్‌ని అధికారికంగా ధృవీక‌రించింది చిత్ర‌బృందం. చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్ లో సాగుతోంది మ‌రో వైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలూ న‌డుస్తున్నాయి.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ “తేజ‌గారు క‌థ చెప్పిన‌ప్పుడే క‌చ్చితంగా రానా కెరీర్‌లో ఓ విభిన్న‌మైన చిత్రం అవుతుంద‌నిపించింది. క‌థ అంత కొత్త‌గా ఉంది. రానాలోని న‌టుడు మ‌రో కొత్త అవ‌తారంలో క‌నిపించ‌డానికి ఆస్కారం దొరికింది. తెలుగు,త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాం. `నేనే రాజు – నేనే మంత్రి` అనే టైటిల్‌ని ఈ సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నాం. టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌… అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు తేజ మాట్లాడుతూ “మ‌న చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతున్నా మ‌నం ప‌ట్టించుకోం. ఎవ‌రి ఆక్రంద‌న‌లు వినిపించ‌వు. ఏ అవ‌మానాలూ క‌నిపించ‌వు. పోతే పోనీ అనుకొంటూ కాలం గ‌డిపేస్తుంటాం. ద‌శాబ్దాలుగా మ‌నం ఇలానే బ‌తికేస్తున్నాం. ఈ దృక్ప‌థాన్ని మార్చే చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`. రానా పాత్ర స‌రికొత్త ఆలోచ‌న‌ల్ని రేకెత్తిస్తుంది. స‌మాజంలో మార్పుని తీసుకొస్తుంది. అదెలా అనేది వెండితెర‌పై చూడండి“ అన్నారు.

క‌థానాయ‌కుడు రానా మాట్లాడుతూ “అన్ని విధాలుగానూ ఇదో అత్యుత్త‌మ స్క్రిప్ట్‌. మ‌న ఆలోచ‌నా దృక్ప‌థాన్ని మార్చేసే సినిమా ఇది. తేజ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆక‌లి.. ఇవ‌న్నీ ఏళ్లుగా చూస్తూనే ఉన్నా. ఆయ‌న‌కు నేను అభిమానిని. తేజ ఆక‌లే కాదు.. మా అంద‌రి ఆక‌లీ తీర్చే చిత్ర‌మిది“ అన్నారు రానా.

రానా, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఛాయాగ్ర‌హణం: వెంక‌ట్ సి.దిలీప్‌,
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: నారాయ‌ణ రెడ్డి
రచన: పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ
నిర్మాత‌లు: సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు: అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌
స‌మ‌ర్ప‌ణ‌: డి. రామానాయుడు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ‌

To Top

Send this to a friend