బాబాయి కోసం అబ్బాయి ముందే..!

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ముందుగా అనుకున్న ప్రకారం అయితే అక్టోబర్‌ లేదా నవంబర్‌లో విడుదల కావాలి. కాని షూటింగ్‌ చాలా ఆలస్యంగా జరుగుతున్న కారణంగా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సంక్రాంతికి ఇప్పటికే మహేష్‌బాబు, కొరటాల శివల కాంబో మూవీ ‘భరత్‌ అను నేను’ మరియు చరణ్‌, సుకుమార్‌ల ‘రంగస్థలం’ అనే చిత్రాలు విడుదలకు వేచి ఉన్నాయి.

పవన్‌ మూవీ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులు సుకుమార్‌ అండ్‌ టీంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. చరణ్‌ బాబాయిపై అభిమానంతో 25 రోజుల ముందుగానే అంటే క్రిస్టమస్‌కు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ధృవ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్‌ అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేశాడు. ఇప్పుడు కూడా చరణ్‌ డిసెంబర్‌లో ‘రంగస్థలం’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

‘రంగస్థలం’ చిత్రం ముందే విడుదల కానున్న నేపథ్యంలో పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ హడావుడి లేకుండా మెల్లగా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో వైపు రామ్‌ చరణ్‌ నిర్మాణంలో చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్దం అవుతుంది.

To Top

Send this to a friend