ప్రపంచ దేశాలపై ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకి కొవిడ్-19 రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భారత్ లోనే వైరస్ అదే దూకుడుకు కొనసాగిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ మహమ్మారీని అంతమొందించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది.
ఆ క్రమంలోనే ఈ ప్రభావం వినోద పరిశ్రమపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా రోజువారీ కూలీపై జీవించే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు.. హీరోలంతా భారీగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రవీణ క్రియేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ తమ చిత్రబృందంలోని కార్మికులందరికీ నిత్యావసరాల సాయానికి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా `షార్ట్ టెంపర్` నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ-“ప్రస్తుతం ప్రపంచం యావత్తూ కరోనా వల్ల క్లిష్ట పరిస్థితిలో ఉంది. మన దేశంలో మహమ్మారీ ప్రవేశించడంతో లాక్ డౌన్ అమల్లో ఉంది. దీనివల్ల రోజువారీ కూలీల పరిస్థితి అయోమయంగా ఉంది. ముఖ్యంగా సినీపరిశ్రమ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అందుకే మా ప్రవీణ క్రియేషన్స్ తరపున మా `లాక్ డౌన్` మూవీ కార్మికులందరికీ నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకుల సాయం చేయనున్నాం. నాతో పాటుగా దర్శకుడు రాఘవ, కెమెరామెన్ ముజీర్ మాలిక్ ఆధ్వర్యంలో ఈ సాయం చేస్తున్నాం“ అని తెలిపారు.
