ఏపీలో మారిన రాజకీయాలు


ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న రాజకీయాలు ఏపీలో కాకరేపుతున్నాయి. మంగళవారం మోడీ-జగన్ భేటి తర్వాత ఏపీలో టీడీపీ శిభిరంలో గుబులు మొదలైంది. వచ్చే 2019 ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న అమిత్ షా వారం రోజుల్లో ఏపీలో పర్యటించబోతున్నారు. అంతకుముందే జగన్ మోడీని కలిసి మంతనాలు జరిపారు. రాజకీయ అవసరాల మేరకు ఇటు మోడీ , అటు జగన్ లు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో ఏపీలో వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడనుంది.

*గెలుపు గుర్రమనే మోడీ ఫోకస్
దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న మోడీకి ఇప్పుడు జగన్ పరిస్థితి అందివచ్చిన అవకాశంగా కనపడుతోంది. జగన్ ను వెంటాడుతున్న సీబీఐ కేసులను బూచీగా చూపి ఏపీలో బీజేపీ పగ్గాలను జగన్ చేతిలో పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. వైసీపీని బీజేపీలో విలీనం చేసి జగన్ ను ఏపీ సీఎం చేయాలని మోడీ భావిస్తున్నారు. ప్రతిగా సీబీఐ కేసులను మాఫీ చేయాలని జగన్ ప్రధానిని వేడుకుంటున్నాడు. దీంతో రాజకీయ అవసరాలు ఈ ఇద్దరిని దగ్గర చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

*చంద్రబాబుపై వ్యతిరేకతే కారణమా..
ప్రధాని మోడీ తన మిత్రపక్షమైన టీడీపీతో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో కొనసాగుతున్నారు. చంద్రబాబు-మోడీల మధ్య మంచి స్నేహం ఉంది. అయినా కూడా జగన్ ను మోడీ కలవడంతో టీడీపీ, బీజేపీ స్నేహానికి బీటలు వారినట్టు సమాచారం. మోడీ, వచ్చే 2019 ఎన్నికల్లో జగన్ తో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ముప్పు తప్పదని భావిస్తున్నాయి. రోజురోజుకు చంద్రబాబుపై ఏపీలో వస్తున్న వ్యతిరేకతను ఇంటెలిజెన్స్ సాయంతో తెలుసుకున్న మోడీ.. వ్యూహాత్మకంగా జగన్ ను దగ్గరికి తీస్తున్నట్టు అర్థమవుతోందని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.

మొత్తంగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయోగాలతో దక్షిణాదిలో తమిళనాడు, ఏపీలో రాజకీయాలు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. తప్పనిసరి పరిస్థితులను సృష్టించి బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న మోడీ ఆశయంలో అటు పన్నీర్ సెల్వం, ఇటు జగన్ లు పావులుగా మారుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend