పవన్‌ మావాడే..

నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని టీడీపీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వైపు చూస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబును తన భుజాలపై విజయతీరాలకు చేర్చిన పవన్‌ కల్యాణ్‌ నంద్యాలలో కూడా తమకే మద్దతు ఇస్తారని టీడీపీ భావిస్తోంది.

సీఎంతో కలిసి భోజనం చేసి బయటకు వచ్చిన వెంటనే పవన్ రాజకీయప్రకటన చేయడంతో ఆయన తమవాడేనన్న భావన టీడీపీ నేతల్లో మరింత బలపడింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తొలి నుంచి కూడా భాయీ భాయీనే అని జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ కూడా పవన్‌ కల్యాణ్ తమ వాడేనని చెబుతున్నారు.

మీడియాతో మాట్లాడిన ఆమె నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ మద్దతు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే ఉంటుందన్నారు. భూమా కుటుంబంతోనూ పవన్‌ కల్యాణ్‌కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. కాబట్టి పవన్ కల్యాణ్ తమ కుటుంబానికి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును కలిసి వచ్చిన పవన్‌ కల్యాణ్ నంద్యాల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తామన్నది రెండు రోజుల్లోచెబుతానన్నారు. అయితే పవన్‌ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చినా ఇబ్బందేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు.

పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ ఓడిపోతే వన్ షాట్.. టూ బర్డ్‌ అన్నట్టుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ బలమేంటో తెలుసుకునేందుకు 2019 వరకు ఆగాల్సిన పని ఉండదంటున్నారు. అయితే చంద్రబాబు విషయంలో తొలి నుంచి సానుకూలంగా ఉంటూ, పలుమార్లు ఆయనతో సమావేశమవుతున్న పవన్ కల్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

To Top

Send this to a friend