ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్నెల్లలో కొత్త చట్టం

ముస్లింల పెళ్లిళ్లు-విడాకులకు సంబంధించి ఒక సమగ్ర చట్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇప్పటివరకూ వున్న ట్రిపుల్ తలాక్ పధ్ధతి పూర్తి ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డ సుప్రీమ్ ధర్మాసనం.. ఆరునెలల పాటు దీనిపై నిషేధం విధించింది. దీన్ని కొనసాగించాలా, వేరే పధ్ధతి ఏదైనా అమల్లోకి తేవాలా అనే అంశంపై నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేసింది. ఆర్నెల్లలోగా ముస్లిం విడాకులకు సంబంధించి చట్టం తీసుకొచ్చే బాధ్యతను పార్లమెంటుకు వదిలేసింది.మగాళ్లు మూడు సార్లు తలాక్ చెప్పి భార్యలను వదిలేసే పద్ధతికి ట్రిపుల్ తలాక్ అని పేరు. 14 వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం చెలామణీలో వుంది.

అయితే.. ట్రిపుల్ తలాక్ విడాకుల పద్ధతి మహిళల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేదిగా ఉందని.. దీన్ని తొలగించేలా చట్టం తీసుకురావాలని పిటిషన్‌దారులు కోర్టుకెక్కారు. ఐదు మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు.. ఈ పిటిషన్లను విచారించారు. వీళ్ళలో ముగ్గురు జడ్జీలు తలాక్ పద్దతిని అమానవీయమని పేర్కొన్నారు.

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మాత్రం ఈ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించింది. పూర్తి మత సంబంధితమైన ఈ వ్యవహారంపై కోర్టులు గానీ, ప్రభుత్వాలు గానీ జోక్యం చేసుకోకూడన్నది ముస్లిం మత పెద్దల అభిమతం. ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి తోసేలా వుంది.

To Top

Send this to a friend