ఆకుకూరలతో ఆరోగ్యం భద్రం..!

‘ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి’.. ఇది చిన్నప్పటి నుంచి మనం వినే మాటే.. ఇతరులకు ఆరోగ్యపరమైన సలహాలిచ్చే సమయంలోనూ ‘ఆకుకూరలు బాగా తినండి’ అని చెబుతుంటాం. కానీ మన విషయంలో దాన్ని ఎంత వరకు అనుసరిస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? మనలో రోజులో కనీసం ఒక్కపూటైనా భోజనంలో ఆకుకూరను భాగం చేసుకునేవారు కొందరుంటే అసలు వాటి పేరే గిట్టనట్లు మొహం పట్టేవారు మరికొందరు. అయితే మార్కెట్లో విరివిగా లభించే ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చో తెలిస్తే, వాటిని ఇష్టపడని వారు కూడా తినేందుకు ఆసక్తి చూపుతారు.

• మరి ఆ లాభాలేంటో చూద్దామా..

• గోంగూర

వేడివేడన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని, దానికి కాస్త నెయ్యి జతచేసి తింటే ఆ రుచేవేరు కదండీ.. పుల్లని ఈ గోంగూర రుచికి ఎంత అద్భుతంగా ఉంటుందో దాని వల్ల కలిగే లాభాలూ అంతే గొప్పగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, బి6తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండే గోంగూరతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణశక్తిని మెరుగుపరచడం, ఎముకలను దృఢంగా చేయడం, రక్తప్రసరణ సజావుగా కొనసాగేలా చూడడం, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడం, మధుమేహాన్ని నియంత్రించడం, గుండె, మూత్రపిండాల వ్యాధుల్ని నివారించడం లాంటి అనేక ప్రయోజనాలున్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలుసుకున్నారు కాబట్టే ఈ ఆకుకూరను మనదేశంతో పాటు విదేశాల్లోనూ విరివిగా వినియోగిస్తున్నారు.

• తోటకూర

ఆకుకూరల్లో రారాజు తోటకూర. ఈ కూరను సరిగ్గా వండగలిగితే దీనంత రుచికరమైన ఆకుకూర మరొకటి ఉండదంటే నమ్మండి.. కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ‘ ఎ’ తో పాటు విటమిన్ కె, సి, బి6, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే తోటకూర శరీరానికి కావల్సిన శక్తిని సమకూర్చుతుంది. తోటకూర ఆకుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పోషకాహారంగా భావిస్తారు. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తలేమి(అనీమియా)తో బాధపడేవారికి సరైన ఔషధంగా చెబుతారు వైద్యులు. ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. ఒత్త్తెన నల్లని జుట్టు కోసం తోటకూరను రోజూ తప్పకుండా తినాల్సిందే.

• పాలకూర

ఎక్కుమందిలో క్రేజ్ ఉన్న ఆకుకూర పాలకూర. వంటల్లో బాగా చేయి తిరిగిన చెఫ్‌లు సైతం వారికి ఇష్టమైన ఆకుకూరల్లో మొదటిది పాలకూర అనే చెబుతారు. రుచితో పాటు ఆరోగ్యానికి చిరునామాగా మారిన ఈ ఆకుకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందేకాదు ఎ, సి, కె, బి కాంప్లెక్స్ విటమిన్‌లతో పాటు వృద్ధాప్యంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే పోషకాలు పాలకూరలో ఉన్నాయి. పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలను అధిగమించవచ్చు.

• బచ్చలికూర

ఆకుకూరల్లో మరో రుచికరమైన కూర బచ్చలి కూర. అమైనో ఆమ్లాలు, ఐరన్ పుష్కలంగా ఉండే బచ్చలికూరతో రక్తలేమి, పోషకాహార లోపం వంటి సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని సలహా ఇస్తున్నారు పోషకాహార నిపుణులు. మాంసం, గుడ్డు, పాలకు సమానంగా ఇందులో పోషకాలుంటాయంటే దీనివల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు.

• ఇవేకాదు.. చుక్కకూర, పొన్నగంటి కూర, గంగవాయల కూర, మొంతి కూర.. ఇలా ఏ ఆకుకూరను తీసుకున్నా శరీరానికి అవి వివిధ రకాల పోషకాలను అందజేస్తాయి.

To Top

Send this to a friend