కేసీఆర్, చంద్రబాబు.. మాకేం ఫ్రీ వద్దు..


రైతులకు ఎరువులు ఉచితం.., వ్యవసాయానికి కరెంటు ఉచితం.. రుణ మాఫీ, విత్తనాలు సబ్సిడీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్లో రైతులకు అన్నీ ఫ్రీ.. వీరికి ఇంకేం కావాలి అని అనుకుంటారు కానీ, కావాలి.. ఇవన్నీచ్చినా చివరకు పంట పండించిన రైతుకు మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. మిర్చి రైతును వ్యాపారులు సిండికేటుగా మారి దోచుకుంటున్నారు. ధర తగ్గించి దగా చేస్తున్నారు. రైతు ఆరునెలల ఆరుగాలం కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు. ఆర్థిక ఇబ్బందులు రైతును చుట్టుముడుతున్నాయి. అందుకే ఎన్ని ఉచిత హామీలు ఇస్తున్నా.. రైతులు మాత్రం తమకు ముందు గిట్టుబాటు ధర కావాలని నినదించడం ఇద్దరు సీఎం లు చంద్రబాబు, కేసీఆర్ లను ఇరకాటంలోకి నెట్టింది.

కేసీఆర్ తెలంగాణలో అందరికీ వరుసగా జీతాలు పెంచుతున్నారు. అది చూసి కాపీకొడుతూ బాబు పెంచేస్తున్నాడు.. కేసీఆర్ ఇటీవలే అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా గుర్తించి 4,000/- జీతం నుండి 10,000/- జీతంగా పెంచారు. 1,500 /- ఉన్న సర్పంచ్ జీతం 5,000/- చేశాడు.. 75,000/-  ఉన్న యం.ల్.ఎ  జీతం 1,50,000/- చేశాడు.. ఇక గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను భారీగా పెంచేశాడు. వీరందరూ అడిగినా అడగకున్నా వరాలు కురిపించాడు. కానీ రైతులు రోడ్డెక్కి పండించిన పంటను కాల్చివేస్తున్నా కేసీఆర్, చంద్రబాబు లు ఎందుకు నోరుమెదపడం లేదన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. వారందరికీ ఏ విధంగా పెంచారో.. అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వాల్లో స్పందన రాకపోవడంతో రైతులు రోడ్డెక్కి మార్కెట్ల వద్ద రాస్తారోకోలు , ధర్నాలు చేస్తున్నారు.

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ అన్నీ సదుపాయాలు కల్పించాడు. రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీ… ఉద్యోగులు పనిచేసేది ఉదయం 9 గం: నుంచి 4:30 గం: ల వరకు ఉద్యోగి ఖచ్చితంగా టైంకి వెళతాడో, లేదో తెలియదు.. టీచర్లు ఐతే చెప్పక్కర్లేదు 365 పని దినాలకుగాను వారు పని చేసేది 185 రోజులు మాత్రమే.. కానీ ఒక్క రైతుకు మాత్రం తాను పండించిన పంటను చూసుకోవడానికి లిమిటెడ్ టైం లేదు. రేయి పగలు కష్టపడి పండిస్తాడు. రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళతాడు. తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలకు దూరంగా కష్టిస్తాడు. అప్పు చేసి పంటను పండిస్తాడు. తీరా పంటను అమ్ముకుందామంటే దళారులు, వ్యాపారులు సిండికేట్ గా మారి ముంచుతుంటే కడుపు మండి రైతు రోడ్డెక్కుతున్నాడు. పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు ఎలా తీర్చాలో తెలియక .. కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియక రైతులు అసువులు బాస్తున్నారు. ఎద్దు ఏడ్చిన పంట.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. మిర్చి, ధాన్యం రైతులు ఇంతలా తెలుగు రాష్ట్రాల్లో కష్టాలు పడుతున్నా ఉపశమన చర్యలు చేపట్టని ఈ ప్రభుత్వాలను ఏమనాలో తెలియడం లేదు..

To Top

Send this to a friend