కేసీఆర్ సర్వే : ప్రతిపక్షాలు ఆలౌట్

కేసీఆర్ మరోసారి తాజాగా సర్వే నిర్వహించారు. ఇందులో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు ఆలౌట్ అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేవలం రెండంటే రెండే స్థానాలు దక్కించుకుంటుందట.. మజ్లిస్ కు ఆరు స్థానాలు దక్కి టీఆర్ఎస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందట.. ఈ సర్వే కేసీఆర్ కు సంతోషం కలిగించోచ్చు కానీ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు మాత్రం ఆశనిపాతంలా మారింది..

ఇటీవల తెలంగాణపై దండయాత్ర చేసిన అమిత్ షా నల్గొండ జిల్లాలో బీజేపీ సమావేశాల్లో పాల్గొని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చానని.. కేసీఆర్ మోసం చేస్తున్నారనే విమర్శించారు. వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం అని ఘీంకరించారు. కానీ అప్పుడే అమిత్ షా విమర్శలకు ధీటుగా బదులిచ్చిన కేసీఆర్ తాజాగా చేసిన సర్వే విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఒక్క సీటు రాదని కేసీఆర్ వెల్లడించారు.

కేసీఆర్ నిర్వహించిన సర్వేలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో 111 సీట్లు వస్తాయని తేలిందట.. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను టీఆర్ఎస్ కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్ష కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. ఇక బీజేపీ, టీడీపీకి ఒక్క సీటు రాదని కేసీఆర్ తేల్చేశారు. కేసీఆర్ సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు టీఆర్ఎస్ నేతల ముందు సర్వే విషయం బయటపెట్టారు. అంతేకాదు.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని చెప్పారు. జూలైలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. పెరిగే సీట్లలో బయట నుంచి పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇక ఎమ్మెల్యేల ప్రజాదరణ విషయంలో కేసీఆర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. కేసీఆర్ ప్రాతినిధ్య గజ్వేల్ అసెంబ్లీలో కేసీఆర్ కు 98శాతం ప్రజాదరణ పొందింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సిరిసిల్లలో 91శాతం ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు. ఇక మంత్రి హరీష్ రావు కు సిద్దిపేట లో 88 శాతం మంది ప్రజలు ఆమోదం తెలపడం విశేషం. అయితే ప్రజాదరణలో చివరన ఉన్నాడేమో కానీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫలితాలను మాత్రం కేసీఆర్ ప్రకటించకపోవడం గమనార్హం.

To Top

Send this to a friend