కేసీఆర్ ధమాకా.. మోడీని మించి జీతమా.?

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ప్రధాని మోడీని మించి తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే సంస్థ టీఎస్సీపీఎస్సీ చైర్మన్ కు జీతాలివ్వడం తెలంగాణలో గుబులు రేపుతోంది. తెలంగాణలో ఇంతవరకు ఉద్యోగాల కల్పన జరగలేదు. ప్రభుత్వం ప్రకటించడం.. నిబంధనలు బాగా లేవంటూ కొందరు కోర్టు కెళ్లడం అవి వాయిదా పడడం జరిగిపోతున్నాయి. ఏం ఘనకార్యం చేసారని టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల జీతాలను మూడింతలుగా పెంచారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

రూ.80 వేలగా ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నెల జీతాన్ని రూ.2.25 లక్షలు, రూ.79 వేలగా ఉన్న సభ్యుల నెల జీతాన్ని రూ.2.24 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. తమ ఆదేశాల మేరకు నోటిఫికేషన్లు జారీ చేయనందుకు, జారీ చేసిన నోటిఫికేషన్లు తప్పుడు తడకలుగా తయారు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు గాను ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సభ్యులకు ఈ నజరానా ప్రకటించిందా అని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవగాహనారాహిత్యం, అలసత్వం, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, అవినీతి.. ఇవన్నీ టీఎస్పీఎస్సీ సభ్యులకు పర్యాయపదాలు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ను, సభ్యులను భర్తరఫ్ చేయాల్సింది పోయి వారి జీతాలను మూడింతలుగా పెంచడం తెలంగాణ వ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది.

టీఎస్పీఎస్సీ ఏర్పాటు అయి సరిగా మూడేళ్లు పూర్తయింది. రాష్ట్రంలో సుమారుగా 1.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే. అందులో 9,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలే. 6,000 మాత్రమే మిగితా ఉద్యోగాలు. 2012 తరువాత ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాలేదు. తెలంగాణ వచ్చిన తరువాత కడియం శ్రీహరి గారు ఇప్పటికి డిఎస్సి పై 350 ప్రకటనలు చేశారు. కానీ, ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. సుప్రీమ్ కోర్టు మొట్టికాయలు వేసి సెప్టెంబర్ 11 లోపు భర్తీ చేయాలని చెప్పినా ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ కు సిద్ధం కావాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అయ్యాక పరీక్ష నిర్వహణకు కనీసం 45 రోజులు పడుతుంది. దాని తర్వాత ఫలితాల వెల్లడి, ఖాళీల భర్తీకి మరికొన్ని నెలలు పడుతుంది. అలాంటిది సెప్టెంబర్ 11 లోపు భర్తీ ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి గారు చెప్పాలి.

తెలంగాణ సమాజాన్ని ఇంకా ఎన్ని రోజులు ఇలా ఈ ప్రభుత్వం మభ్యపెట్టదల్చుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి, ఇదిగో అదిగో నోటిఫికేషన్ అని చెపుతున్న ఈ ప్రభుత్వం పై తెలంగాణ యువతకు ఎప్పుడో నమ్మకం పోయింది. నమ్మకం పోయింది కాబట్టే, నిరుద్యోగులు ఓయూలో రోడెక్కారు. నిరుద్యోగ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగుల భయానికి ముఖ్యమంత్రి గారు ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో కనీసం మాట్లాడలేకపోయారు. ఇలా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో మొండిపట్టుదలతో పోతుండడం ఎవ్వరికీ మింగుడుపడడం లేదు.

To Top

Send this to a friend