కేసీఆర్ , నయీం .. ఓ పోలీస్ కథ..


నయీంను ఎన్ కౌంటర్ చేసి సంవత్సరం గడిచిపోయింది. ఊరువాడ, మీడియా గీడియా అంతా మొత్తుకున్నారు. ఆ నరహంతకుడు నయీంను పెంచి పోషించి అతడి ఎదుగుదలకు తోడ్పడింది పోలీసులేనని నిర్ధారణ కూడా అయ్యింది. ఇన్నాళ్లూ పోలీసులను టచ్ కూడా చేయని కేసీఆర్ ఎట్టకేలకు నయీంతో అంటకాగిన పోలీసుల సస్పెన్షన్ వేటు విధించారు. నయీం సెటిల్ మెంట్లలో పాలుపంచుకొని కోట్లు దిగమింగిన పోలీస్ బాస్ పాపం ఇన్నాళ్లకు పండింది..

సీఎం కేసీఆర్ ఆదినుంచి ఎక్కడ వ్యతిరేకత రాకుండా తన చేతికి మట్టి అంటకుండా చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడుపుతున్నాడు. నయీం లాంటి నరహంతకుడితో అంటకాగిన పోలీసుల సంఖ్య చాలా పెద్దగా ఉంది. అందుకే తెలంగాణ మొదట్లో చర్యలు చేపడితే పోలీసులతో సంబంధాలు చెడిపోతాయని.. కేసీఆర్ ఊరుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం వేడి, ఉద్రిక్తత తగ్గిపోవడంతో కొద్దిమందిపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యలైన వారిని సస్పెండ్ చేసి మిగతా వారికి స్వల్ప శిక్షలు విధించి ఈ ఇష్యూని వదిలించుకున్నారు.

నయీం కేసులో ప్రధానంగా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.

వీరికి నయీంతో సంబంధాలున్నాయని మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది. మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నయీం కేసు మరోసారి వెలుగులోకి రావడం, అందులో పోలీసులపై చర్యలు తీసుకోవడం తెలంగాణలో సంచలనం సృష్టించింది..

To Top

Send this to a friend