కేసీఆర్.. కాంగ్రెస్ ను తిట్టడం వెనుక మర్మమిదే..

తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు.. లేక ఉద్యమం బలహీనపడ్డప్పుడల్లా కేసీఆర్ ఏదో అంశాన్ని లేవనెత్తి ఆ వేడి తగ్గకుండా చేసేవారు.. దీక్షలని, సభలని , ఏదో కాంట్రవర్సీ చేసి ఉద్యమాన్ని బతికించేవారు. అంతటి రాజకీయ పండితుడు కాబట్టే అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో లేడంటే అతిశయోక్తి కాదు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా అందులోంచి చాకచక్యంగా బయటపడడం ఎలాగో ఆయనకు తెలిసినట్టే ఎవ్వరికీ తెలీదు.. బుధవారం కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం వెనుక కూడా పెద్ద రహస్యమే ఉంది..అదేంటో మీరే కింద చదవండి..

కరీంనగర్ పాత జిల్లాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. అదే నేరెళ్ల ఘటన.. ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల గ్రామస్థుడు చనిపోతే ఆ గ్రామస్థులందరూ 10 ఇసుక లారీలను దహనం చేసి పోలీసులను కొట్టి నానా భీభత్సం చేశారు. దీనిపై పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. అందులో నలుగురు దళితులున్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.. ఇందుకు కారణాలున్నాయి. ఎందుకంటే ఘటన జరిగిన నేరెళ్ల .. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంది. దీంతో కాబోయే సీఎంగా.. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కేటీఆర్ ను.. తద్వారా సీఎం కేసీఆర్ ఇరుకున పెట్టవచ్చని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దీనిపై పోరాడుతున్నారు. ఢిల్లీ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను కూడా రప్పించి దళితులను చిత్రహింసలకు గురిచేశారని నానాయాగీ చేశారు. మొత్తంగా ‘‘ఇదీ నేరెళ్ల సంఘటన..’’

ఈ సంఘటన జరిగి నెలరోజులవుతున్నా అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కం మంత్రి అయిన కేటీఆర్ స్పందించలేదు. ఇటు సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు స్పందించలేదు. కానీ బుధవారం కేసీఆర్ అకస్మాత్తుగా విలేకరుల సమావేశానికి వచ్చి కాంగ్రెస్ ను చెడుగుడు ఆడాడు. తెలంగాణకు పట్టిన పిశాచి అంటూ కాంగ్రెస్ ను ఎండగట్టాడు. ఇప్పుడే కేసీఆర్ విలేకరుల సమావేశానికి రావడానికి బలమైన కారణం ఉంది.

నేరెళ్ల ఘటన బాధితుల్ని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. వారికి మర్మంగాలకు కరెంట్ షాక్ పెట్టారట.. వారి పిరుదలపై వేడి దబ్బునాలతో కాల్చారట.. ఇక రోకలు బండలు వేసి నడవకుండా చితకబాదారు. పోలీసుల దెబ్బలకు జైలర్ కూడా నేరెళ్ల బాధితుల్ని జైలులోకి అనుమతించలేదు. ఆ తర్వాత చికిత్స చేయించి జైల్లో పెట్టారు పోలీసులు.. అక్కడికి కట్ చేస్తే బుధవారమే నేరేళ్ల బాధితులకు బెయిల్ వచ్చింది. వారందరూ నిన్న రాత్రి విడుదలయ్యారు.ఈ నేపథ్యంలో వారు వచ్చి పోలీసుల అమానుషాన్ని విలేకరులకు చెబుతారని.. ఇది పెద్ద ఇష్యూ అవుతుందని తెలివిగా అంచనావేసిన కేసీఆర్.. సడన్ గా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నేరెళ్ల ఘటన సహా అన్నింటిపై కాంగ్రెస్ నాయకులను చెడుగుడు ఆడారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ కేసులు వేసిందని.. సింగరేణి, విద్యుత్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా అడ్డుకుంటోందని హైకోర్టు కెళ్తుందని నేరెళ్ల ఘటనను చాలా బాగా హైలెట్ కాకుండా చేయడంలో అందరినీ కేసీఆర్ దారి మళ్లించారు.. అందుకే ఈరోజు పత్రికల్లో టీవీలో కేసీఆర్ మాట్లాడిందే ప్రముఖంగా వస్తుందని కానీ నేరెళ్ల బాధితులు పోలీసులపై చేసిన విమర్శలు ఎక్కడా ప్రస్తావనకు రావడం లేదు..

ఇలా కేసీఆర్ ఓ నేరెళ్ల ఘటనను విజయవంతంగా డైవర్ట్ చేయడం లో సక్సెస్ అయ్యాడు. సమకాలీన రాజకీయ నేతల్లో కేసీఆర్ దిట్ట అని నిరూపించుకున్నారు. అటు నేరెళ్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ను కాపాడడంతో పాటు పోలీసులను, తన ప్రభుత్వాన్ని ఇరుకున పడకుండా కరెక్ట్ గా నేరేళ్ల బాధితులు జైలు నుంచి విడుదలయ్యాకే విలేకరుల సమావేశంలో మాట్లాడి వారి వార్తలు హైలెట్ కాకుండా అడ్డుకోగలిగారు. ఇలా కేసీఆర్ రాజనీతి, రాజకీయాలు మామూలుగా ఉండవనడానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణ..

To Top

Send this to a friend