ఫీచర్ ఫోన్ బుకింగ్స్ నిలిపివేసిన జియో

జియో ఫీచర్ ఫోన్ హాట్ కేకులా అమ్ముడైపోవడంతో బుక్ చేసుకున్న కోటి మందికి సెప్టెంబర్ 1 నుంచి 4 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ చేస్తామని జియో తెలిపింది. జియో వెబ్ సైట్ ద్వారా ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల ఫోన్లు బుక్ చేసుకున్నారు. ఇక శుక్ర, శని వారాల్లో మొత్తం కోటికి పైగా ఫోన్లు బుక్ అయినట్టు సమాచారం. దీంతో ముందస్తు బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జియో పేర్కొంది. దీంతో ఫోన్ దక్కక ప్రయత్నిస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ప్రీ బుకింగ్స్ ను నిలిపివేసిన జియో.. ఫోన్ కావాలనుకునేవారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ నెల 24 సాయంత్రం 5.30 గంటలకు దేశప్రజలందరూ 1500 డిపాజిట్ తో ఉచితంగా అందజేస్తున్న జియో ఫీచర్ కోసం ఎగబడ్డారు. దీంతో ప్రారంభించిన వెంటనే జియో వెబ్ సైట్, అప్లికేషన్ మొత్తం కుప్పకూలాయి. దీంతో దాన్ని బాగుచేయడానికి చాలా సేపు పట్టగా కొంత మంది మాత్రం బుక్ చేసుకోగలిగారు. ఇంకా ఎంతో మంది ఈ ఫోన్ కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో రాబోయే రోజుల్లో దాదాపు 10 కోట్ల ఫోన్లు సిద్ధం చేసేందుకు జియో ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

ఫోన్లు ఎక్కడ తీసుకోవాలనేది ఎస్.ఎం.ఎస్ ద్వారా తెలుపుతామని జియో తెలిపింది. అంచనాలకు మించి జియో ఫీచర్ ఫోన్ కోసం ఎగబడడంతో ప్రస్తుతానికి ఫోన్ బుకింగ్స్ ను నిలిపివేయడం ప్రజలను నిరాశపరిచింది.

To Top

Send this to a friend