జానా చెప్పిన బాహుబలి ..

కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ జానారెడ్డి చెప్పిన బాహుబలి ఎవరో తెలిసిపోయింది.. టీఆర్ఎస్ లో ఫుల్ ఫాంలో ఉన్న అతడేనా బాహుబలి? గులాబీ కొమ్మకు పూసిన పువ్వు హస్తం పార్టీలో పరిమళించబోతోందా? తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే… ఓ నెలన్నర వెనక్కు వెళ్లాల్సిందే…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఓ రోజు కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డిగారు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నారు. చిట్ చాట్ ముగింపు సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. 2019 లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఓ బాహుబలి వస్తాడని చెప్పారు. అంతే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది…మీడియా ప్రతినిధులలో ఉత్కంఠ రేగింది. ఎవరు సార్ ఆ బాహుబలి అని సందేహ నివృత్తి కి ప్రయత్నించారు. యథాలాపంగా ఆ పైవాడు అంటూ జానారెడ్డి పైకి చేయి చూపించారు. పై వాడంటే హరీష్ అనుకునేరు (అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయం పైనే టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఉంటుంది…జానా ఈ వ్యాఖ్య చేసిన సమయంలో కాకతాళీయంగా ఆ కార్యాలయంలో హరీష్ ఉన్నారు)…

నా ఉద్ధేశం దేవుడు అని జానా సవరణ చేశారు. సీన్ కట్ చేస్తే నెలన్నర తర్వాత అదే హరీష్ కాంగ్రెస్ లోకి వస్తారని జోరుగా చర్చ మొదలైంది. టీఆర్ఎస్ లో రోజు రోజుకు మారుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో అసలు కథ నెలన్నర క్రితమే మొదలైందా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. ఆ రోజు జానారెడ్డి బాహుబలి గురించి సరదాగా ఏం చెప్పలేదు…హరీష్ ను దృష్టిలో పెట్టుకునే ఆ కామెంట్స్ చేశారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

జానా చెప్పిన బాహుబలి హరీషే అన్న భావన క్రమంగా తెర మీదకు వస్తోంది. దీనికి తగ్గట్టుగానే హరీష్ కాంగ్రెస్ కు రావాలంటూ ఆ పార్టీ నేతలు ఆహ్వానాలు మొదలు పెట్టారు. హరీష్ మంచి పని మంతుడని, అసలు ఉద్యమం నిర్మించిందే హరీష్ అని కాంగ్రెస్ నేతలు తన్నీరును భుజానికెత్తుకుంటున్నారు. పరాయి పార్టీలో బలమైన నేతను పనిగట్టుకుని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న. ఆ నేత తమ గూటికి చేరుతాడన్న సమాచారమైన అయి ఉండాలి…లేదా ఆ నేత సహకారంతోనే గులాబీ బాస్ కుంభస్థలం పై కొట్టొచ్చన్న వ్యూహమైనా అయి ఉండాలి. మొత్తం మీద జానారెడ్డి చెప్పిన తమ బాహుబలి హరీషేనని ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.

To Top

Send this to a friend