ప్రతిపక్షాలకు ఆయుధమిస్తున్న కేసీఆర్

అవును.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు కేసీఆర్.. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెస్తున్నాడు. ఉమ్మడిగా ఉద్యమించేలా ఉసిగొల్పుతున్నాడు.. ఇన్నాళ్లు.. ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు డీలాపడిపోయిన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేసీఆర్ నిర్ణయాల పుణ్యమాని ప్రజలు, రైతుల సమస్యలపై పోరాటాలు చేస్తూ మళ్ళీ తమ ఉనికిని చాటుకొంటూ ప్రజలకు చేరువకాగలుగుతున్నాయి. అంతేకాదు..బద్ద శత్రువులైన పార్టీలన్నీ ఇప్పుడు ఒకేతాటిపైకి వచ్చి అధికార తెరాసను బలంగా ఢీకొంటూ దానికి ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి.

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం గన్ పార్క్ వద్ద మౌనదీక్షలు, మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలలో కాంగ్రెస్, భాజపా, తెదేపాల ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు, బందులు, కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమాలు చాలా జోరుగా సాగాయి. మరోపక్క సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘సేవ్ సింగరేణి’ పేరిట సిపిఐ నేతలు సింగరేణి కార్మిక సంఘాల నేతలతో కలిసి బస్సు యాత్ర మొదలుపెట్టింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆందోళన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలు ప్రజలకు, తెరాస సర్కార్ కు కూడా చాలా ఇబ్బంది కలిగించేవే. కనుక వీటన్నిటినీ వీలైనంత వేగంగా చల్లార్చి రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం కల్పించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే! ఆయన వీటిని ఏవిధంగా చల్లారుస్తారో చూడాలి.

కేసీఆర్ ని..ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బద్దశత్రువులైన కాంగ్రెస్, భాజపా, తెదేపా,వామపక్షాలు కలిసి పోరాడటం విచిత్రమే. కానీ ఆవిధంగా అవి ఎంతకాలం పనిచేయగలవు? కాంగ్రెస్-భాజపా, అలాగే కాంగ్రెస్-తెదేపా, భాజపా-వామపక్షాలు రేపు ఒకదానిని మరొకటి విమర్శించుకోకుండా ఉంటాయా? అప్పుడు కూడా అవి ఇలాగే కలిసి పోరాడగలవా?అని ఆలోచిస్తే వాటి ఐక్యతలో డొల్లతనం అర్ధం అవుతుంది. రాజకీయంగా, సైద్దాంతికంగా విభేధించుకొంటున్న ఈ పార్టీలన్నీ మరి ఎందుకు కలిసి పనిచేస్తున్నాయి? అంటే తమ రాజకీయ ప్రయోజనాల కోసమేనని చెప్పక తప్పదు. అయితే వాటికి ఈ అవకాశం కల్పించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు.

To Top

Send this to a friend