ఫిదాతో ఫిదా అవుతున్నారు..

అది తెలంగాణ నేపథ్య కథ.. తీసింది ఆంధ్రా డైరెక్టర్.. హీరోయిన్ ఏమో మళయాళీ.. ఎక్కడా పోలిక లేకున్నా కానీ సినిమా మాత్రం బాగా వచ్చింది. రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది.. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల తీసిన చిత్రం ఫిదా. ఈ సినిమా ఓవర్సీర్ లో దుమ్మురేపుతోంది. ఫిదా సినిమా హిట్ కావడానికి ప్రధానంగా తెలంగాణ నేపథ్య కథ.. హీరోయిన సాయి పల్లవి తెలంగాణ యాస, భాష చెలకీ నటన.. సహజసిద్ధమైన కథాంశమే కారణమని రివ్యూలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 10లక్షల డాలర్ల రికార్డు కలెక్షన్లు సాధించిందని నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన నాని సినిమా ‘నిన్నుకోరి’ సినిమాతోపాటు వరుణ్ తేజ్ ఫిదా కూడా ఓవర్సీస్ వసూళ్లలో రికార్డు సృష్టిస్తుండడం గమనార్హం. రెండు విదేశీ నేపథ్య కథతోనే తీసినవి కావడం విశేషం.

ఫిదా, నిన్నుకోరి రెండు సినిమాలు కథలో భాగంగా విదేశాల్లో తీసినవే.. ఈ రెండు కథల్లో కూడా విదేశీ నేపథ్యం ఉంటుంది. ఎన్నారైలను కథలో భాగం చేసి అక్కడి వారి మనసును , కలెక్షన్లను కొల్లగొట్టేందుకు ఇలా కథను తీర్చిదిద్దినట్టు సమాచారం. అందుకే తెలుగుతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాలు విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఫిదా సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఓ రోజు ముందుగానే విడుదలైంది.

ఫిదా సినిమా రెండు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు సాధించిందని.. లాంగ్ రన్ లో ఒకటిన్నర మిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందని అమెరికా లోని ఫిదా డిస్ట్రిబ్యూటర్ లు చెబుతున్నారు. అమెరికాలో ఫిదా తొలిరోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోందట.ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా 3 లక్షల 63వేల డాలర్లు వసూలు చేయగా.. శుక్ర, శనివారాల్లో మొత్తం 7లక్షల 13వేల డాలర్లు వసూళ్లు చేసినట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. మొత్తానికి ఫిదా సినిమాతో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఫిదా అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది.

To Top

Send this to a friend