ఈ తీరు అనుమానాస్పదమే..

పవన్‌ కల్యాణ్‌ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ రాజకీయం చేస్తున్నారన్న విమర్శ తొలి నుంచి ఉంది. అయినప్పటికీ ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబును కలిసిన పవన్‌ కల్యాణ్… బాబుతో భేటీ ముగిసిన వెంటనే ప్రెస్‌ మీట్‌ పెట్టి రాజకీయ ప్రకటన చేయడం ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు భేటీ అనంతరం తాను అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. కానీ ప్రెస్‌మీట్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఎగ్గొట్టారు. చంద్రబాబుకు ఇబ్బంది కలిగేంచే ప్రశ్నలకు తెలివిగా దాటవేశారు. కొత్త తరహా స్వచ్చమైన రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్‌ కల్యాణ్… ఫిరాయింపులపై ప్రశ్న ఎదురవగానే సూటిగా సమాధానం చెప్పలేదు. అలాంటి తప్పుడు పని ఎవరు చేసినా తప్పేనని కనీసం ఖండించలేకపోయారు. పైగా అందరూ చేస్తున్నారు… దొరికితే దొంగ లేదంటే దొర అని వ్యాఖ్యానించి దిగ్బ్రాంతి కలిగించారు.పరోక్షంగా ఫిరాయింపు రాజకీయాలు జనసేన దృష్టిలో తప్పేమీ కాదని తీర్మానించినట్టు అయింది.

గరగపర్రుకు ఇతరపార్టీ నేతలు వెళ్లారు కదా మీరెందుకు వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకోలేదని పశ్నించగా… తాను వెళ్తే ఇబ్బందులొస్తాయని వ్యాఖ్యానించారు. గరగపర్రు అంశంలో అధికారుల వైఫల్యాన్ని ప్రస్తావించిన పవన్‌… ప్రభుత్వాన్ని మాత్రం పల్తెత్తు మాట అనలేదు. కాపులంతా రోడ్డెక్కి ముద్రగడ యాత్రకు అనుమతి కోసం పోరాడుతుంటే పవన్‌ మాత్రం… పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మాత్రం ప్రశ్నించలేదు. అన్నింటికి మించి పాదయాత్ర చేస్తారా? అని ప్రశ్నించగా… ప్రజా సమస్యలు తెలుసుకోవడం ముఖ్యం… అందుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు.

పైగా పాదయాత్రకు అభిమానులు సహకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్పడం ద్వారా జనసేన అభిమానుల క్రమశిక్షణపై పవన్‌ కల్యాణే అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఉంది. మొదటినుంచి కూడా తాను వెళ్తే జనం ఎగబడుతారు… అందు వల్ల ఇబ్బందులు వస్తాయని పవన్ చెబుతూ ఉండడం ప్రత్యేకంగా ఉంది. అసలు చంద్రబాబును కలిసి వచ్చిన వెంటనే రాజకీయ ప్రకటన చేయడం కూడా ఉద్దేశపూర్వకంగా చేసినా యాధృచ్చికంగా చేసినా వ్యూహాత్మక తప్పిదంగానే భావిస్తున్నారు.

అక్టోబర్‌ నుంచి జగన్‌ పాదయాత్ర మొదలుపెడుతారు కాబట్టి… ఇప్పుడు పవన్‌ను చంద్రబాబు రంగంలోకి దింపుతారు అన్న విమర్శ సోషల్‌ మీడియాలో చాలా రోజులుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు బలాన్ని ఇచ్చేలా చంద్రబాబుతో భేటీ అనంతరం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్‌ చెప్పడం అనుమానాస్పదంగానే ఉంది. నంద్యాల ఉప ఎన్నిక టీడీపీకి కీలకంగా మారిన నేపథ్యంలో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని పవన్ ప్రకటిస్తానని చెప్పారు. ఆ నిర్ణయం బట్టి కూడా పవన్‌ రాజకీయంగా ఎటువైపు ఉన్నారో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద పవన్‌ కల్యాణ్ ప్రెస్‌ మీట్ లో టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు పెద్దగా ఆసక్తిచూపుతున్నట్టుగా లేదనిపిస్తోంది.

To Top

Send this to a friend