దర్శకరత్న దాసరి కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. సినీ పరిశ్రమ అంతా కూడా కన్నీటి పర్యంతం అయ్యింది. ఆయన్ను సినీ పరిశ్రమకు చెందిన దాదాపు అంతా కూడా గురువు గారు అంటూ గౌరవంగా పిలుచుకునే వారు. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దాసరి మరణం ప్రతి ఒక్కరికి కన్నీరును మిగిల్చింది. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా చెప్పుకునే దాసరి చిన్న నిర్మాతలకు మద్దతుగా నిలిచారు.

అత్యధిక సినిమాలను తెరకెక్కించి గిన్నిస్‌బుక్‌ రికార్డును దక్కించుకున్న దాసరి రాజకీయాల్లో కూడా రాణించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో దాసరి నారాయణ రావు కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన విషయం తెల్సిందే. మూడు నెలల క్రితమే అనారోగ్య కారణాల రిత్యా హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యి, పూర్తిగా కోలుకున్నారు. అయితే మళ్లీ పది రోజుల క్రితం దాసరి మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో కిమ్స్‌లో ఆయన్ను జాయిన్‌ చేశారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న దాసరి నిన్న మద్యాహ్నం వరకు కూడా బాగానే ఉన్నారని, సాయంత్రం 7 గంట సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆపై గుండె పోటుతో మరణించినట్లుగా వైధ్యులు ప్రకటించారు. దాసరి మృతికి సంతాపంగా నేడు టాలీవుడ్‌ బంద్‌ను ప్రకటించడం జరిగింది. సినిమా థియేటర్లు కూడా నేడు మూసే ఉంటాయని సినీ వర్గాల వారు ప్రకటించారు.

To Top

Send this to a friend