మళ్లీ తెరపైకి పవన్‌…. బాబుతో కీలక భేటీ

ప్రశ్నిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్‌ కల్యాణ్‌… ఎన్నికల తర్వాత కూడా టీడీపీ విషయంలో కాస్త సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకహోదా విషయంలో మోడీని, వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీలను విమర్శించిన పవన్ కల్యాణ్‌…. చంద్రబాబు విషయంలో మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా పవన్‌ కల్యాణ్‌ మాత్రం చంద్రబాబు విషయంలో సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ తన కార్యక్రమాలను ఉధృతం చేయడం, అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో… చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ ఆసక్తికరంగా ఉంది.

రాష్ట్రపతి ఎన్నికలతో పాటు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోమవారం పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చర్చించే అవకాశం ఉంది. జనసేన పార్టీలో పనిచేసేందుకు ఆసక్తికలవారి కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ వివరించనున్నట్టు సమాచారం. ఉద్దానం కిడ్నీ బాధితుల అంశాన్ని కూడా పవన్‌ ప్రస్తావించనున్నారు. అయితే కేవలం కిడ్నీ బాధితుల అంశం కోసమే అయితే బీజీ షెడ్యూల్‌లోనూ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని… ఈ భేటీ వెనుక రాజకీయ వ్యూహరచనే కీలక ఎజెండాగా చెబుతున్నారు.

జగన్ పాదయాత్ర, నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు మరోసారి తెరపైకి తెస్తున్నారని భావిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు నేరుగా చంద్రబాబుతో భేటీ అవడం ఆసక్తికరంగా ఉంది. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇప్పటి నుంచే ఉమ్మడి వ్యూహరచన చేస్తున్నారా అన్న భావన కూడా కలుగుతోంది. చూడాలి చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!.

To Top

Send this to a friend