బుల్లితెరకు బిత్తిరిసత్తి గుడ్ బై..

ఎవరు ఎప్పుడు హీరోలవుతారో తెలియదు.. ఒకప్పుడు పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ వచ్చిన చేవెళ్ల రవి.. ఒక్క అవకాశం అంటూ సినిమాలు, చానల్స్ తిరిగినా ఫలితం దక్కలేదు. చివరకు ఆ దేవుడి కరుణించి తీన్మార్ లో బిత్తిరి సత్తిగా అవతారం ఎత్తి హాస్యపు జల్లు కురిపిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. బుల్లితెరపై తీన్ మార్ న్యూస్ ద్వారా వీ6 చానల్ లో పాపులర్ అయిన సత్తి అనంతరం తెలుగు రాష్ట్రాల్లో అందరినోటా నానాడు. ఇప్పుడు సత్తి పేరు తెలియని వారు ఏపీ, తెలంగాణల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు.. నవ్వుల జల్లు కురిపించే తీన్మార్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారంటే సత్తి స్టామినాను అర్థం చేసుకోవచ్చు.. ఇటు తీన్మార్ లో నటిస్తూనే అటు సినిమాల్లోనూ కనిపిస్తూ సత్తి అలరిస్తున్నారు. ఇటీవల సత్తి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన ‘ఇద్దరి మధ్య 18’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

సత్తి చేసే కామెడీకి ఫిదా అయ్యి ఇటీవలే ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా ఆడియో ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సత్తి వేసిన ప్రశ్నలు, యాంకరింగ్ కు అటు వేడుకకు హాజరైన జనం,,ఇటు హీరో రానా, హీరోయిన్లు కాజల్, కేథరిన్, దర్శకుడు తేజ, నిర్మాత రామనాయుడు సహా అందరూ పడిపడి నవ్వారు. సత్తి వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక చాలా మంది నవ్వుకున్నారు.. ప్రోగ్రాం బాగా హిట్ అయ్యింది. దీంతో మరిన్ని ఆడియో ఫంక్షన్లకు సత్తిని వ్యాఖ్యాతగా ఎంపిక చేసుకోవడానికి నిర్వాహకులు పోటీ పడుతున్నారట..ఇన్నాళ్లు ఆడియో ఫంక్షన్ అంటే నాలుగు పాటలు విడుదల చేసి మమ అనిపించేవారు . కానీ దర్శకుడు తేజ బిత్తిరి సత్తిని ప్రవేశపెట్టి నేనే రాజు నేనే మంత్రి ఆడియోను బాగా రక్తి కట్టించాడు. ఆ ప్రోగ్రాంలో సత్తి కురిపించిన హాస్యపు జల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

ప్రస్తుతం తీన్మార్ లో వచ్చే 5 నిమిషాల ఎపిసోడ్ కోసం సత్తికి ఆ చానల్ యాజమాన్యం ప్రతినెలా 1.50లక్షల రూపాయల వేతనం అందిస్తోందట.. కానీ బయట ఏదైనా ఓపెనింగ్స్ కు, ఇతర ఆడియో ఫంక్షన్లలో పాల్గొనడానికి సత్తికి సదురు నిర్వాహకులు రోజుకు 10 లక్షల పారితోషికం ఇస్తున్నారట.. ఇక సినిమాల్లో నటిస్తే 20 లక్షల దాకా ఇస్తున్నారట.. ఇలా తీన్మార్ లో కంటే బయటే ఎక్కువ సంపాదన వస్తుండడంతో సమయాభావం వల్ల సత్తి తీన్మార్ ను వదిలేసి ఆ చానల్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ సమాజానికి ఇక 9.30కు సత్తి కనపడనట్టే.. సత్తి సినిమాల్లో నటిస్తూనే బయట ప్రోగ్రాంలు చేసుకుంటేనే తీన్మార్ లో తమను అలరించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. కానీ దీన్ని ప్రేక్షకులు ఆలకిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend