కేసీఆర్ ‘కోటి’ వరం వెనుక..

పాకిస్తానీని పెళ్లి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మమేకం కానీ సానియా మీర్జాకు రెండు కోట్లు.. ఇక ఏపీ మూలాలున్న పీవీ సింధుకు కోటి రూపాయలు.. ఇలా పక్క రాష్ట్రం, ఇతర ప్రాంతాల మూలాలున్న వారికి కోట్లకు కోట్లు వరాలు ప్రకటించిన కేసీఆర్ కు .. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన మిథాలీ రాజ్ గుర్తుకురావడం లేదా అని సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు.. కేసీఆర్ సర్కారును ఎండగడుతూనే ఉన్నారు..

ఈ పోస్టులు, వార్తలు కేసీఆర్ వారకూ చేరాయో ఏమోకానీ ఎట్టకేలకు విమర్శలకు జడిసి భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఆమె కు కోటిరూపాయల నగదు పారితోషికంతో పాటు బంజారాహిల్స్ లో 600గజాల స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన మిథాలీ, ఆమె కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ ఈ మేరకు కోటి, ఇంటి స్థలం ఇచ్చేస్తున్నట్టు మీడియాకు తెలిపారు.

నిజానికి సానియా మీర్జా హైదరాబాద్ లో ఉంటున్నా కూడా తెలంగాణ ప్రజలతో మమేకం కావడం లేదు. ఇక్కడి ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేయడం లేదు. అయినా కేసీఆర్.. సానియా మీర్జానే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి కోట్లకు కోట్లు ముట్టజెప్పారు. దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఇక ఆంధ్రా ప్రాంతానికి చెందిన పీవీ సింధూకు కేసీఆర్ వరాలు ఇచ్చాడు. కానీ ఆమె ఏపీ తరఫున తన ప్రాతినిధ్యం అన్నట్టు చెప్పింది.

ఇక హైదరాబాదీ మిథాలీరాజ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఈసారి మహిళా ప్రపంచకప్ లో భారత్ ను ఫైనల్ చేర్చింది. తుదికంటా పోరాడిన మహిళల జట్టు ఓడిపోయింది. అయినా భారతీయుల మనసులు గెలిచిన మిథాలీని తెలంగాణ ప్రభుత్వం అభినందించకపోవడం నజరానా ప్రకటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అదే సమయంలో మిథాలీతో పాటు ఆడిన ఇతర మహిళా క్రికెటర్లకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించడం విశేషం. అన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు జడిసి కేసీఆర్ సర్కారు ఎట్టకేలకు మిథాలీకి కోటి రూపాయాల పారితోషికాన్ని ప్రకటించడం గమనార్హం.

To Top

Send this to a friend