బాలయ్యతో మాకు బాదయ్యా..

నందమూరి హీరో బాలక్రిష్ణకు ఆయన సొంత నియోజకవర్గంలో తీవ్ర అవమానం జరిగింది. ఓ దున్నపోతుపై బాలక్రిష్ణ అని రాసి తమ తాగునీటి గోస తీర్చని ఎమ్మెల్యే బాలక్రిష్ణ అంటూ మహిళలు రోడ్డెక్కారు.. బాలక్రిష్ణ సినిమాలోని ఫేమస్ డైలాగులను తమ నిరసనలో ప్రజలు ఉపయోగించుకోవడం విశేషం.. ‘చూడు.. హిందుపురం వైపు చూడు.. మరో వైపు చూస్తే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేవు’ అని రాసిన ఫ్లకార్డులను చేతబట్టి వినూత్న నిరసన తెలిపారు. తెరపైనే హీరో.. రియల్ గా జీరో అంటూ మహిళలు బాలక్రిష్ణ తమ తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడాన్ని తూర్పార పట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు, హీరో బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎండలు మండిపోతుండడంతో నీటి చుక్క కరువైంది. దీంతో జనం నీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేతల ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలు తాగునీటి కొరత తీర్చాలంటూ ఖాళీ బిందెలను తలపై పెట్టుకొని హిందూపురం మార్కెట్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు..
కాగా ఏపీ సీఎం వియ్యంకుడి ఇలాకాలో దున్నపోతుపై బాలక్రిష్ణ అని పేరు రాసి ఊరేగించిన వారిపై పోలీసులు ప్రతాపం చూపించారు. వారిపై లాఠీచార్జి చేశారు. అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు , నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం , తోపులాటలు నడిచాయి. ఎన్నికల్లో గెలిస్తే రూ.250 కోట్లతో ప్రత్యేక పైప్ లైన్ వేయించి పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని చెప్పిన బాలక్రిష్ణ ఆరు నెలలుగా సినిమాలు చేసుకుంటూ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
To Top

Send this to a friend