చైనాకు ‘బాహుబలి 2’..

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా దేశంలోనే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో కూడా భారీ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ చిత్రాన్ని చైనా తీసుకు వెళ్లేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల చైనాలో విడుదలైన ‘దంగల్‌’ చిత్రం దాదాపు 500 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. అంతటి కలెక్షన్స్‌ను సాధించిన ‘దంగల్‌’ చిత్ర స్ఫూర్తితో ‘బాహుబలి 2’ చిత్రాన్ని కూడా అక్కడ విడుదల చేయాలని భావిస్తున్నారు.

‘బాహుబలి’  మొదటి పార్ట్‌ను చైనాలో భారీగా విడుదల చేయడం జరిగింది. చైనా మీడియాకు బాహుబలి టీం ఇంటర్వ్యూలు ఇవ్వడం, భారీగా ప్రమోషన్‌ చేయడం కూడా జరిగింది. కాని అక్కడ ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ పెట్టుబడిని కూడా రాబట్టలేక ఢీలా పడిపోయింది. దాంతో నిర్మాతలకు చేదు అనుభవం మిగిల్చింది. ఇండియన్‌ ప్రేక్షకులు నిరాజనాలు పట్టిన ‘బాహుబలి’ చైనా వారికి నచ్చలేదు. అందుకే ఇప్పుడు రెండవ పార్ట్‌ను అక్కడ విడుదల చేయవద్దని కొందరు అంటున్నారు.

మొదటి పార్ట్‌ నచ్చని వాళ్లకు రెండవ పార్ట్‌ నచ్చుతుందనే నమ్మకం లేదని ఖచ్చితంగా బాహుబలి రెండవ పార్ట్‌ కూడా వారికి నచ్చదని కొందరు ముందే అంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేసి ఇక్కడ దక్కిన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయకుండా అక్కడ విడుదల చేస్తే ఫ్లాప్‌ అనిపించుకోవాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం జులైలో ‘బాహుబలి 2’ను చైనా తీసుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు.

To Top

Send this to a friend