బాబు గారు.. ఏవీ ఆ లక్షల కోట్లు?

చంద్రబాబు అనుకూల మీడియా ఊదరగొట్టింది. అమెరికా వెళ్లాడు.. బాబు ఏపీని బంగారం చేస్తాడని ఒకటే కథనాలు.. పెద్ద కంపెనీలతో ఒప్పందాలని కీర్తనలు.. కానీ చంద్రబాబు అమెరికా పర్యటన ముగిశాక.. తెలిసింది. పెట్టుబడులు గట్రా ఒప్పందాలు జరిగినా.. ఇప్పటికీ ఆ మొత్తం.. ఎంతనేది టీడీపీ బృందం ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని పెట్టుబడులు, ఇన్ని లక్షల కోట్లు, ఏపీలోని ఈ ఈ ప్రాంతాల్లో పరిశ్రమలని బాబు బృందం ప్రకటించకపోవడంతో బాబు అమెరికా పర్యటన గాలిబుడగ అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకుముందు కూడా బాబు చాలా దేశాల్లో పర్యటించారు. కానీ ఆ పెట్టుబడుల గుట్టు మాత్రం అలానే ఉండిపోయింది. జర్మనీ, దక్షిణ కొరియా, దావోస్, కజికిస్తాన్ , సింగపూర్ లో ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు. లక్షల కోట్ల పెట్టబడులు, పరిశ్రమలంటూ ఊదరగొట్టారు. కానీ పర్యటన ముగిసి ఇన్ని రోజులైనా ఏపీలో పరిశ్రమలకు శంకుస్థాపనలు లేవు.. పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు పర్యటనల ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన పరివారం, అధికారులు పోతుండడంతో ఖర్చు బారెడు.. ఆదాయం జానెడు అన్న చందంగా వ్యవహారం మారింది. లక్షల కోట్ల ప్రకటనలు తప్ప ఇంతవరకు ఏపీలో అడుగుపెట్టిన పెద్ద కంపెనీ లేకపోవడం గమనార్హం.

అప్పట్లో విశాఖలో సీఐఐ సదస్సు జరిగింది. వేదిక మీద చంద్రబాబు రూ.10 లక్షల కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు. ఆ ఒప్పందాలన్నీ ఇప్పటికీ పేపర్ల మీద తప్ప ఏపీలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు.. ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చింది లేదు. ఇక ప్రస్తుత చంద్రబాబు అమెరికా పర్యటన సమయంలో ఎన్నో ప్రకటనలు.. మైక్రోసాఫ్ట్, ఆపిల్, డెల్, బెల్ వంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలంటూ ఊదరగొట్టే ప్రసంగాలు.. తీరా బాబు అన్ని సర్దుకొని ఏపీలోకి రాగానే అవన్నీ అటకెక్కుతున్నాయి. తనది చేతల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చంద్రబాబు చేతల్లో మాత్రం ఆ ఫలితాలు చూపించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాబు గారి పర్యటన ముగిశాక ఏవీ ఆ లక్షల కోట్లు అని నాయకులు ప్రశ్నిస్తున్నారు.?.

To Top

Send this to a friend