ఏపీ పరువు పోయింది..


ఏపీలో తన్నుకోండి.. గుద్దుకోండి.. దుమ్మెత్తిపోసుకోండి పర్లేదు.. ఇక్కడ మీడియాలో, ప్రజల్లో ఆ రెండు పార్టీల సంగతి తెలుసు కాబట్టి ఏం పట్టించుకోరు. కానీ దేశం కాని దేశంలో.. అదీ ప్రపంచ పెద్దన్న లాంటి అమెరికాలో కూడా తెలుగోళ్ల పరువును గంగలో కలిపేశాయి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు.. తమ పంథాలు, పట్టింపులు, రాజకీయ కుతంత్రాలను ఏపీలోనే కాక అమెరికాలో కూడా చూపించి ఏపీ పరువు తీశారు.. ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు యావత్ తెలుగు జాతికే అవమానంగా పరిణమించాయి..

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అసెంబ్లీ అయినా బయట అయినా.. సోషల్ మీడియాలోనైనా.. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. వీటిని ఇక్కడితో వదిలిపెట్టకుండా అమెరికాలోనూ కొనసాగించి రాష్ట్రం పరువును టీడీపీ, వైసీపీ తీసేశారు..

అమెరికాలో పెట్టుబడుల కోసం ప్రవాసాంధ్రులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసిందని పచ్చమీడియా కోడై కూస్తోంది. అమెరికాలోని వైసీపీ మద్దతు దారులు కొందరు అమెరికన్ పోలీసులు, ఇర్వింగ్ నగర మేయర్ కు చంద్రబాబుపై ఫిర్యాదు చేశారట.. బాబు అక్రమంగా నిధుల సేకరణకు వచ్చాడని.. ఎర్ర స్మగ్లర్లను చంపించారని.. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ ఈమెయిళ్లు పంపారు. దీంతో ఆ మేయర్ పోలీసులను చంద్రబాబు మీటింగ్ హాల్ కు పంపారు. బాబు సమావేశాన్ని చూసి ఇది ప్రవాసాంధ్ర మీటింగ్ అని గ్రహించి పోలీసులు ఊరుకున్నారు. అంతేకాదు. చంద్రబాబుకు ఎర్రస్మగ్లర్ల నుంచి ముప్పు ఉందని అమెరికన్ పోలీసులు భద్రత పెంచారట..

ఇలా ఏపీ రాష్ట్ర సీఎం పెట్టుబడుల కోసం ప్రవాసాంధ్రలో పర్యటిస్తే.. ఆయనపై లేని పోనివి కల్పించి ఫిర్యాదు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వైసీపీ మాత్రం తమపై అభాండాలు మోపుతున్నారని.. టీడీపీ అక్రమ పెట్టుబడులపై అమెరికన్ పోలీసులు ఉక్కుపాదం మోపితే ఆ నెపం తమపై వేసి టీడీపీ తప్పించుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందులో ఏదీ నిజం.. అబద్ధం అని పక్కనపెడితే టీడీపీ, వైసీపీ మధ్యన ఈ కుటిల రాజకీయం అమెరికాలో ఏపీ పరువును మాత్రం తీసేసింది.

To Top

Send this to a friend