అన్నీ ఉన్నా.. నోట్లో శని..


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం.. ప్రపంచంలోనే దిగ్గజ, భీకర టీట్వంటి ఆటగాళ్లు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరు జట్టే.. అంతటి భీకర జట్టు వరుస ఓటములతో కళ తప్పింది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం 2 మాత్రమే గెలిచింది. 8 ఓడిపోయింది. 1 టై అయ్యింది. గడిచిన సారి ఐపీఎల్-16లో బెంగళూరు ఫైనల్ చేరి హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. రన్నరప్ జట్టు.., పైగా కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి ఉద్దండ పిండాలు ఉన్న జట్టు ఇలా దారుణంగా చిన్న జట్లపై ఓడిపోవడం ఆ జట్టు కెప్టెన్ కోహ్లీని కలవరపరుస్తోంది.

మొదటి రెండు మ్యాచ్ లకు కోహ్లీ అందుబాటులో లేడు. ఆ తర్వాత గాయం తగ్గి జట్టులోకి వచ్చినా బెంగళూరు తలరాత మారలేదు. క్రిస్ గేల్ ఏదో మ్యాచ్ లో చెలరేగుతున్నాడు. కోహ్లీ కూడా 50 పైనే కొడుతున్నాడు. ఏబీ డివిలియర్స్ మెరుస్తున్నాడు. కానీ సమష్టిగా రాణించలేకపోతున్నారు. భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. పైగా బెంగళూరు బౌలింగ్ తీసికట్టుగా ఉంది. దీంతో ప్రత్యర్థులు బెంగళూరును సులువుగా ఓడిస్తున్నారు.

ఈ వరుస ఓటములపై కోహ్లీ తీవ్ర మనస్థాపంతో ఉన్నాడు. పూణే చేతిలో 60లోపే అలౌట్ అయినప్పుడు కోహ్లీ బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కాడు. ‘ఫ్రొఫెషనల్ క్రికెట్ లో తాను ప్రాతినిధ్యం వహించిన టీంలో తన కెరీర్ లో ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని.. తమ జట్టు పూర్తి విఫలమైందని’ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఆటతీరు ఏమాత్రం సంతృప్తికరంగా సాగలేదని కుండబద్దలు కొట్టాడు. ఇంత అయోమయ బ్యాటింగ్ తన జన్మలో చూడలేదని వాపోయారు.

To Top

Send this to a friend