అమరావతి రాజధాని పరిరక్షణ..

అమరావతి రాజధాని పరిరక్షణకు ఈ ప్రాంత ప్రజలు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి.
రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న ప్రజలు ” అమరావతి పరిరక్షణ సమితి/సంఘం ” పేరుతో పోటీ చేయాలి. రాజకీయ పార్టీల తో సంబంధం లేని తటస్థులను అభ్యర్థులు గా నిలపాలి.రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ లలో రాష్ట్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా పంచాయతీ తీర్మానాలు చేయడం చాలా అవసరం. పంచాయతీ లకు విస్తృత అధికారాలు ఉన్నాయి.కాబట్టే CRDA లో కలపడానికి గ్రామ పంచాయతీ ల తీర్మానాన్ని ప్రజల అంగీకారంగా భావించారు.

భూముల సేకరణ లో,పూలింగ్ లో గ్రామ పంచాయతీ ల తీర్మానం, గ్రామ సభలు చట్ట రీత్యే అవసరం.అలాగే పూలింగ్ చేసిన భూములు తిరిగి ఇచ్చి వేయాలని ప్రభుత్వం అనుకున్నా పంచాయతీ లు వ్యతిరేకంగా ఓటు చేస్తే ప్రభుత్వ వాదన న్యాయస్థానంలో నిలబడడం కష్టం. అలాగే నష్టం తప్పనిసరి ఐనప్పుడు నష్టపరిహారం కోసం కూడా పోరాడడానికి కూడా గ్రామ పంచాయతీలలో చేసే తీర్మానం తప్పకుండా ఉపయోగపడుతుంది.హైకోర్టు, సుప్రీంకోర్టు లలో కూడా రైతుల సంఘటిత వాదనలకు కూడా గ్రామ పంచాయితీ తీర్మానం ఉపయోగపడుతుంది.

అదే సమయంలో అమరావతి రాజధాని ప్రాంతం గ్రామాల్లో ఎన్నికలు జరగకపోతే ప్రత్యేక పాలనాధికారుల సహాయం తో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసే అవకాశం ఉంటుంది.స్థానిక ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్థులు నిలబడితే వారికి వ్యతిరేకంగా మిగిలిన అన్ని పార్టీలు “అమరావతి పరిరక్షణ సమితి” కి మద్దతు ప్రకటించాలి.రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా, అమరావతి ప్రాంతం ఎడారిగా,స్మశానం గా వర్ణించిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలి.

ఎలాగూ జనవరి 22వ తేదీన అమరావతి ప్రాంత రైతులు హైకోర్టు లో వేసిన పిటీషన్ లు విచారణ కు రాబోతున్నాయి.కనుక దాదాపుగా హైకోర్టు స్టే ఇవ్వవచ్చు. లేదా స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికార వైసీపీ రాజధాని మార్పు నిర్ణయం తీసుకుంది అని ఒక పిటీషన్ వేస్తే ఎన్కికలకోడ్ ప్రకారం ప్రభుత్వ నిర్ణయం వాయిదా పడే అవకాశం కూడా ఉంది.ఏదైనా అమరావతి రాజధాని తరలిపోకుండా ఈ ప్రాంత ప్రజలు కలిసికట్టుగా,రాజకీయాలకు అతీతంగా పోరాడటానికి సిద్ధపడాలి.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend