అఖిల్‌ 2 బడ్జెట్‌ హడలెత్తిస్తుంది


అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మొదటి షెడ్యూల్‌లో 20 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రెండవ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు మూడు పాటలను కూడా చిత్రీకరించనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయిదు పాటల కోసం 20 కోట్లను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పాటలో శంకర్‌ రేంజ్‌లో గ్రాఫిక్స్‌ను మరియు హాలీవుడ్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీన్స్‌ చిత్రీకరణ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా నాగార్జున నిర్మించేందుకు ముందుకు వస్తున్నాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్‌ రెండవ సినిమాకు ఏకంగా 60 కోట్లను కేటాయించారు. ఆ బడ్జెట్‌ మరింతగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.

తెలుగు మరియు తమిళంలో భారీగా మార్కెట్‌ ఉన్న దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంపై నమ్మకంతో నాగార్జున ఈ స్థాయిలో బడ్జెట్‌ను పెడుతున్నాడు. అఖిల్‌ మొదటి సినిమా 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి కనీసం 20 కోట్లను కూడా వసూళ్లు చేయలేక పోయింది. మరి రెండవ సినిమాతో అఖిల్‌ ఈ భారీ బడ్జెట్‌ను రికవరీ చేయగలడా అనేది చూడాలి.

To Top

Send this to a friend