ఆంద్ర్రుల ఆత్మగౌరవాన్నితాకట్టు పెడుతున్న బాబు..


‘అధికారంలోకి రావడానికి ఎన్నైనా చెప్తాం.. వచ్చాక హామీలను బుట్టదాఖలు చేస్తాం’అన్నట్టుంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి.. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చాలా హామీలిచ్చాడు. కాపులను బీసీల్లో చేస్తామన్నారు. అనంతరం గద్దెనెక్కాక కాపులు ఉద్యమిస్తే అణిచివేస్తున్నాడు. కాపుల బీసీల హామీలపై కాలయాపన చేస్తున్నాడు. రుణమాఫీ ప్రకటించి దాన్ని సరిగ్గా చేయడం లేదు. వివిధ వర్గాలు, బీసీలకు, మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నీ అలానే ఉన్నాయి.

*ఓటుకు నోటు నుంచే పీచేముడ్
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓటు కు నోటు కేసు నుంచి కేంద్రం చేతిలో బాబు కీలుబొమ్మగా మారారు. ఏపీ ప్రత్యేక హోదా సహా చాలా హామీలు బీజేపీతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినా వాటిని నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చంద్రబాబు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే వీలున్నా కూడా.. కేసీఆర్ తీసుకున్నన్నీ కూడా తీసుకోవడం లేదు. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని స్థితిలో ఉన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వకున్నా తన కేసుల భయంతో బీజేపీకి అణిగిమనిగి ఉన్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*కేసీఆర్ దూకుడు.. బాబు వెనకడుగు..
ఓ పక్క 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రిజిర్వేషన్ల పరిమితి దాటినా.. కేంద్రం, సుప్రీం మోకాలడ్డే చాన్సు ఉన్న కూడా తెలంగాణలో ఎస్టీలు, ముస్లింల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేశాడు. తద్వారా ఆయా వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు. కేంద్ర ఆమోదిస్తే తమిళనాడు వలే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు 60శాతం మించుతాయి. ఇలా కేసీఆర్ ఆయా వర్గాలను చూరగొనే పనులు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం తను హామీ ఇచ్చిన వర్గాలకు కూడా న్యాయం చేయడం లేదు. కాపులను నట్టేట ముంచాడనే అపఖ్యాతి మూటకట్టుకున్నాడు. ముస్లిం, బీసీలకు ఇంతవరకు ఒక్క పథకం ద్వారానైనా.. రిజర్వేషన్ల ద్వారా అయినా చంద్రబాబు చేసిందేమీ లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు..

*మేలుకోకపోతే కష్టమే బాబు..
తెలంగాణ ఏర్పడ్డాక ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. పింఛన్లు, రేషన్ , డబుల్ బెడ్ రూం ఇళ్లు సహా భక్త రామదాసు ప్రాజెక్టు, పాలేరుకు కృష్ణ నీళ్లు సహా పనులను మంత్రి తుమ్మల దగ్గరుండి చేయిస్తూ టీఆర్ఎస్ బలాన్ని ఖమ్మంలో బాగా పెంచేశారట.. ఖమ్మంకు ఆనుకొని ఉన్న కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా వాసులు కూడా ఈ మధ్య ఖమ్మం బార్డర్ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి ని చూసి కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఇటీవల తెలంగాణ మీడియా మిత్రులు ఖమ్మం బార్డర్ లో పర్యటించినప్పుడు ఆంధ్రా ప్రజల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిన ప్రశంసలు చూసి అవాక్కయ్యారు. ఇలా ఏపీ కట్టుబట్టలతో మిగలడానికి కారణమైన కేసీఆర్ చేస్తున్న పనులు ఏపీలో ప్రజల ఆదరాభిమానలు చూరగొంటుంటే అదే సమయంలో చంద్రబాబు.. ఏ వర్గాలను ఆకట్టుకోని రీతిలో పాలన సాగిస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగై కొనసాగితే 2019 ఎన్నికల్లో బాబుకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

To Top

Send this to a friend