మోడీ గెలవలేదు.. అధికారపక్షాన్ని ఓడించారంతే..

నిజం.. ఇది నిజంగా నిజమే.. మోడీ గెలవలేదు.. అక్కడి అధికారపక్షం ఆగడాలు సహించలేక ప్రతిపక్షాల్ని గెలిపించారు. అదే ఈ ఎన్నికల్లో నిరూపితమైంది. ఈ గెలుపు సంబరంతో బీజేపీ సంబరాలు అంబరాన్నంటినా సరైన ప్రత్యామ్మాయం లేని దేశంలో ఇప్పుడు బీజేపీనే కొంత బెటర్ అన్న ఆలోచన దేశ ప్రజల్లో ఉంది.

* ఎస్పీపై వ్యతిరేకతే కారణం..
ఉత్తరప్రదేశ్ ఎంతో కీలక రాష్ట్రం. ఢిల్లీ లో ప్రధాని పీఠం ఎక్కడానికి ఉత్తరప్రదేశ్ లో గెలవడం చాలా తప్పనిసరి.. అందుకే మోడీ సహా బీజేపీ నేతలందరూ యూపీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా భావించారు. పోరాడారు. జనం పట్టం కట్టగట్టారు. బీజేపీని గెలిపించడంలో ప్రధాన కారణం.. అధికారపక్షమైన సమాజ్ వాదీ పై వ్యతిరేకతే.. సమాజ్ వాదీ పార్టీలో ఎన్నికలకు ముందే తండ్రికొడుకులు ములాయం, అఖిలేష్ అధికారం కోసం కొట్టుకున్నారు. పాలనను గాలికి వదిలేశారు. శాంతి భద్రతలు అడుగంటాయి. దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి. ఇవే బీజేపీకి ఓట్లు పడేలా చేశాయి. యూపీకి సమర్ధ నాయకత్వం అవసరమని ప్రజలు భావించేలా చేశాయి. అందుకే యూపీలోని ప్రాంతీయ పార్టీల పాలనను చూసి జనం విసిగి వేసారి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీకి పట్టం కట్టారు.

*పెద్దనోట్ల కంటే అరాచకమే ఎక్కువ..
పెద్దనోట్లు రద్దు చేసి దేశప్రజానీకం ఆగ్రహానికి గురయ్యారు మోడీ.. నోట్ల రద్దు తర్వాత ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో అందరూ మోడీపై కారాలు మిరియాలు నూరారు. కానీ అంతకంటే పెద్ద ఉపద్రవమే యూపీలో జనాల మనసు మారడానికి కారణమైంది. అదే యూపీలోని అరాచకాలు.. తండ్రి, తనయులు, ఎస్పీ నేతల అవినీతి, అరచకాలతో పాలన పడకేసి ప్రజలు బాధితులుగా మారారు. అందుకే ఇంతటి దారుణ పాలనను చరమగీతం పాడాలని జనం భావించారు. నోట్ల రద్దు కంటే ప్రమాదకరంగా మారిన ఎస్పీ పాలనను చూసి అఖిలేష్ ను బండకేసి కొట్టారు. ముఖ్యంగా యూపీలో బీజేపీ గెలిసిందనే కంటే అధికార అఖిలేష్ కుమ్ములాటలు, గొడవలు, చేవచచ్చిన పాలనతో ఓటమి కొనితెచ్చుకున్నాడనంలో ఎలాంటి సందేహం లేదు.

* మిగతా రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల ఓటమి
పంజాబ్ లోనూ అదే కథ.. అధికార అకాళీ-బీజేపీ కూటమిని దారుణంగా ఓడించి ప్రతిపక్ష కాంగ్రెస్ కు అక్కడ పట్టం కట్టారు. పదేళ్ల అకాళీ పాలనకు చరమగీతం పాడారు. ఇక చిన్నరాష్ట్రాలైన మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ పార్టీగా అవతరించింది. మెజార్టీకి 2 సీట్లు తక్కువయ్యాయి. ఇక గోవాలోనూ బీజేపీ పాలనను జనం తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించారు. అక్కడ కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. మరో స్థానాలు అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ కు తక్కువయ్యాయి.

* తెలిసిన నీతి ఏంటి..?
జనం బీజేపీపై ప్రేమతో ఓటేయలేదు.. అన్ని రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల పాలన నచ్చక ప్రతిపక్షాలకు పట్టం కట్టారు. యూపీలో ఎస్పీ, పంజాబ్ లో బీజేపీ, గోవాలో బీజేపీ, మణిపూర్ లో బీజేపీ, ఉత్తరఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు మెరుగైన పాలన అందించలేక ఓడిపోయాయి. ఈ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలే విజయం సాధించాయి. ఇలా మనకు తెలిసిందేంటంటే.. అధికార పార్టీల అసమర్థతే ప్రతిపక్షాలకు వరం అయ్యింది .. తప్పితే ఇందులో మోడీ స్టామినా.. ప్రభంజనం ఏమీ లేదని చెప్పవచ్చు..

To Top

Send this to a friend