మోడీ కక్ష్య సాధింపు


‘దగా, మోసం.. ఇంత అలుసా.. మోడీ వ్యవహారశైలి చూశాక తెలుగు రాష్ట్రాల రైతుల కడుపు మండిపోతోంది.. ఉత్తరాదిపై వారిపై ఆవాజ్యప్రేమ చూపి.. దక్షిణాది రైతు గోసను చూస్తావా మోడీజీ… మేమేం పాపం చేశాం.. అక్కడా ఇక్కడా పండించేది ఆ రైతే కదా.. ఆ బియ్యానికి.. ఈ బియ్యానికి ఏం తేడా.. మరి యూపీ రైతులకు రుణమాఫీని ప్రకటించి ఏపీ తెలుగు రాష్ట్రాల రైతులను ఎందుకు నట్టేట ముంచుతున్నావ్’ గురువారం పార్లమెంటులో యూపీ రుణమాఫీని కేంద్రం భరిస్తుందని ప్రకటించిన తర్వాత ఓ సామాన్య రైతు ఆవేదన ఇది.. ఇందులో నిజం ఉంది. మోడీ కపట నీతి ఉంది.. తన అనుకునేవాళ్లకు కంచంలో.. కాదనుకున్నవాళ్లకు ఇస్తరాకుల్లో వడ్డించే దమననీతి ఉంది. ఇంత కంటే దారుణం ఇంకోటి ఉండదు..

కేసీఆర్, చంద్రబాబులు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం.. ‘రుణమాఫీ’ హామీ. ఇప్పుడు ఇదే హామీని ప్రధాని నరేంద్రమోడీ యూపీ ప్రజలపై ప్రయోగించారు. బీజేపీ అధికారంలో వస్తే యూపీ రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోషన్ సింగ్ చేత పార్లమెంటులో ప్రకటన చేయించారు. యూపీ రుణభారాన్ని కేంద్రం భరిస్తుందని ఒక్క ముక్కలో చెప్పేశారు.. ఇదే హామీని కేసీఆర్, చంద్రబాబులు అమలు చేస్తామని.. నిధులివ్వాలని మోడీని కోరినప్పుడు ఆయన కనీసం పట్టించుకోలేదు. దీంతో కనీసం బ్యాంకులతో చెప్పి రుణాలను రీషెడ్యూలింగ్, చెల్లింపుల వాయిదాకైనా ఆర్బీఐని ఒప్పించాలన్న విన్నపాన్ని కూడా మోడీ పట్టించుకోలేదు.

ఇప్పుడు యూపీ ఎన్నికల్లో అదే హామీతో గెలిచిన మోడీ అక్కడి రైతులకు దేశ సంపద నుంచి ప్రత్యేకంగా కొంచెం మొత్తం తీసి యూపీ రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఇదే తెలుగు రాష్ట్రాల సీఎంలు కనీసం రీషెడ్యూల్ చేయమన్నా పట్టించుకోలేదు. అక్కడ గెలిపించారని రుణమాఫీ చేస్తున్న మోడీ.. ఇక్కడ ప్రజలు గెలిపించలేదని కక్ష్య సాధింపులు చేస్తున్నారా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ ద్వంద్వ నీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend