బీజేపీనే టార్గెట్.. అఖిలేష్, రాహుల్ ‘మహా’ చెక్.

ఎన్నికలొస్తే ప్రత్యర్థులే మిత్రులవుతారు.. అఖిల భారతాన్ని గెలిచి సమరోత్సాహంతో తొణికిసలాడుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ కూటమిగా ఏర్పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బీహార్ లో ఇదే ఫార్ములాను ఉపయోగించి కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలు విజయం సాధించాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవ.. లాలూ ప్రసాద్ యాదవ్ కాంప్రమైజ్ తో బీహార్ లో బీజేపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ కూడా ఈ కూటమిలో చేరి ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది.

ఇప్పుడు ఇదే ఫార్ములాను యూపీలో అమలు చేయడానికి అధికార పార్టీ నేత, సీఎం అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తో పాటు చిన్నచితకాపార్టీలన్నింటిని జట్టుకట్టి మహాకూటమిగా ఏర్పాటు చేసి యూపీ బరిలో నిలిపారు. లక్నోలో రాహుల్ గాంధీ, సీఎం అఖిలేష్ యాదవ్ లు కూటమి గా ఏర్పడి రోడ్ షో నిర్వహించి ఎన్నికల బరిలో నిలిచారు. ఇద్దరు ఒకేరకం దుస్తులు ధరించి ప్రచారం నిర్వహించి  కార్యకర్తల మనసు దోచారు. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్, ఎస్పీ పొత్తు పెట్టుకొని యూపీ బరిలో నిలవడంతో బీజేపీ ఉలిక్కిపడింది. సొంతంగా పోటీచేస్తున్న బీజేపీకి ఈ రెండు పార్టీల పొత్తు శరాఘాతమే.. మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో అఖిలేష్-రాహుల్ ద్వయం యూపీలో జట్టుకట్టి కలసి పోవడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బలా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత.. వారికి అనుకూలంగా మారి బీజేపీకి చేటు తెస్తుందా అని బీజేపీ పెద్దలు సంశయంలో పడ్డారు. మొత్తానికి అతిపెద్ద రాష్ట్రంలో ఆదివారం పెద్ద పార్టీలు పొత్తు పెట్టుకొని సంచలనం రేపాయి. అంతిమంగా ఇది బీజేపీకి చావుదెబ్బగా అభివర్ణించవచ్చు..

To Top

Send this to a friend