ప్రత్యేక హోదా.. నినదించిన గొంతులేవి..? అనాథలా ఏపీ.

చలసాని చల్లబడ్డాడు.. సర్రున లేచిన శివాజీ సైలెంట్ అయ్యాడు.. హోదాపై హామీ ఇచ్చి అధికారంలోకి తెచ్చిన జనసేనాని పవన్ భంగపడ్డాడు.. అధికారం కోసం అంటకాగిన సీఎం చంద్రబాబు కేంద్రం తీరుతో ఏమీ చేయలేక రగిలిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండి ఈ సదావకాశాన్ని వాడుకోలేని నిస్సహాయత వైఎస్ జగన్ ది.. ఇలా అందరూ ఇప్పుడు మూగనోము ప్రదర్శించి మిన్నకుండిపోతున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అడపాదడపా ట్వీట్లతో తప్పితే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పోరాడలేని అసహాయత ఆయనది.. నిర్మాణం లేని పార్టీ ఆయనది..

రాజకీయాలు భ్రష్టు పట్టేశాయి. అధికారంలోకి రాకముందు ఒకలా.. తరువాత ఒకలా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. దీంతో హామీ ఇచ్చి మరిచిన పార్టీల చరిత్ర గల్లంతవుతోంది.. బీజేపీ-టీడీపీ ఇప్పుడు ఏపీ ప్రజల ముందు దోషులుగా నిలబడ్డాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వలేమని అదే సమయంలో ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో స్పష్టం చేయడంతో ఏపీ భగ్గుమంది.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దీనిపై ఆరంభశూరత్వం ప్రదర్శించింది. కేంద్ర మోసానికి నిరసనగా ఓ బంద్ కు పిలుపునిచ్చింది.. నల్లచొక్కాలు ధరించి హైదరాబాద్ లో అసెంబ్లీకి నిరసన ర్యాలీ తీశారు. దీంతోపాటు ఏపీలో కాంగ్రెస్ , వైసీపీ, సీపీఐ నాయకులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలకు పూనుకున్నారు. అక్కడితో ఆ ఉద్యమం ఎగిసి హోదా సంగతి మరుగునపడిపోయింది..

ఏపీకి ఆదినుంచి అన్యాయమే..
ఆదినుంచి ఏపీ కేంద్ర రాజకీయాలతో మోసపోతూనే ఉంది. ఐదు కోట్ల మంది ఆశలు ఆవిరయ్యాయి. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ-టీడీపీ ప్రజలకు ఆశచూపి అధికారంలోకి వచ్చారు. అనంతరం దారుణంగా మోసపొయారు. హోదా కాదు కదా.. కనీసం ప్యాకేజీ కూడా కేంద్రం ప్రకటించలేదు.. ఏదో రాష్ట్రానికి ఆర్థికలోటు పూడ్చి సాయం చేస్తామని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజల గుండెలు మండాయి. ఇప్పుడు అందరూ మౌనంగా రోధిస్తూ రోడ్లమీదకొచ్చారు.

లేడికి లేచింది పరుగు.. జగన్ తీరు..
ఏపీలో టీడీపీకి అధికారమిచ్చి ఇప్పటికి రెండున్నరేళ్లు దాటింది. క్రమక్రమంగా ప్రజావ్యతిరేకత టీడీపీకి ఎక్కువవుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ విఫలం అవుతోంది.. ఈ పరిణామాలు ఉపయోగించుకోవడంలో ప్రతిపక్ష నేత జగన్ ఘోరంగా విఫలమవుతున్నారు. బీజేపీ గడిచిన 2014 ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఇది నమ్మే ఏపీలో బీజేపీ-టీడీపీకి అధికారం కట్టబెట్టారు ప్రజలు.. కానీ అధికారంలోకి వచ్చాక బీజేపీ దారుణంగా మోసం చేసింది. హోదా కాదు కదా.. కనీసం ప్యాకేజీ కూడా మొక్కుబడిగా ప్రకటించేశారు. దీన్ని టీడీపీ వ్యతిరేకించకపోగా దాన్ని సమ్మతించి వంతపాడింది.. బీజేపీ ప్యాకేజీ కూడా చట్టబద్దత లేకపోవడంతో ఏపీ రగిలిపోయింది . ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా దీనిపై ఏం చేస్తారు. ఇలాంటి అరుదైన మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని ప్రతిపక్ష డీఎంకే ఎలా అందిపుచ్చుకుందో వైసీపీ అలా చేయడంలో విఫలం అవుతోంది.. కానీ మన జగన్ తీరే వేరు.. ఎప్పుడు అరిగిపోయిన ఓదార్పుయాత్రలంటూ తిరిగే బదులు.. ప్రత్యేక హోదా కోసం జిల్లా, గల్లీలు తిరిగి ఫైట్ చేయవచ్చు కదా.. కానీ అదేమీ ఆయనకు చేతకాదు. అందుకే ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. మేలుకోవయ్యా జగన్ మేలుకో..

అదృశ్యమైన శివాజీ, చలసాని, రామకృష్ణ
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ-టీడీపీ చేసిన మోసంపై ఏపీ ప్రజల గుండె మండుతోంది.. పవన్ కళ్యాణ్ నుంచి కాంగ్రెస్, వైసీపీ, కమ్యునిస్టులు సహా అందరూ అప్పుడప్పుడూ ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం కనిపించడం లేదు. ఆయనే హీరో, ఏపీ పొలిటికల్ లోకి దూసుకొచ్చిన శివాజీ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఏపీకి న్యాయం చేస్తుందని వీర కథలు చెప్పి అనంతరం బీజేపీ మడతేయడంతో మొదట్లో పోరుబాటకు శ్రీకారం చుట్టారు. ఒక వేళ బీజేపీ హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తే చంద్రబాబు ఇంటి ముందు ఉరేసుకుంటానని ఆవేశంగా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ కుండ బద్దలు కొట్టింది. ఏపీకి హోదా కాదు కదా.. కనీసం ప్యాకేజీ కూడా ప్రకటించలేదు. దీంతో అందరూ రొడ్డెక్కుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు..
అటు సినిమాల్లో లేక.. ఇటు రాజకీయాల్లో లేక.. ఏపీ ప్రజల తరఫున పోరాడక శివాజీ ఎక్కుడన్నాడని సోషల్ మీడియాలో అందరూ ఏకి పారేస్తున్నారు. ఉరేసుకోకున్నా ఫరవాలేదు కానీ.. కనీసం ఆందోళనలు చేయూ బాబు అంటూ మండిపడుతున్నారు.
ఇక స్వయం ప్రకటిత ఏపీ మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాసరావు, కమ్యూనిస్టు నేత రామకృష్ణలు మొదట్లో ప్రత్యేక హోదాపేరు చెప్పి పబ్బం గడుపుకొని తరువాత మిన్నకుండిపోవడం విమర్శలు తావిస్తోంది..

పవనే వేదన అరణ్యరోదనే.?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కరికే ప్రస్తుతం ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అంతో ఇంతో చిత్తశుద్ధి ఉంది. కానీ ఆయన పార్టీకి క్షేత్రస్థాయి బలం లేకపోవడం.. నాయకుల అండ లేకపోవడంతో ఆయన వేదన అరణ్యరోదనే అవుతోంది.. నాడు మోడీ-చంద్రబాబుతో కలిసి హామీలిచ్చిన పవన్ ఇప్పుడు మరిచిపోయి అన్యాయం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ముందు తల్లిని చంపి బిడ్డకు జన్మినిచ్చారని.. తెలంగాణకు పురుడు పోసి తల్లి ఏపీని చంపేశారన్నారని… కానీ ఇప్పుడు తల్లిని కాల్చేస్తున్నారంటూ బీజేపీ వైఖరిని పవన్ అప్పట్లో తప్పుపట్టి సంచలనం రేపారు.. బీజేపీ హామీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో స్పందించని ఏపీ టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను ఏకిపారేశారు. తుమ్మితే ఊడిపోయే పదవులు పట్టుకొని ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. కేంద్రం అంటే అదేదో బ్రహ్మ రాక్షసి కాదని.. వాల్లు మనుషులేనంటూ కేంద్రంపై పోరాడాలంటూ టీడీపీ , వైసీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.కానీ జనంలోకి వెళ్లి వాళ్లతో కలిసి పోరాడాలనే స్థితిలో పవన్ ఉన్నారు. అభిమానం ఉన్నా దాన్ని ఉద్యమంగా మలచడంలో పవన్ విఫలమవుతున్నారు. ఆయనకున్న పరిమితులు.. పార్టీ నిర్మాణం లేకపోవడం అవరోధంగా నిలుస్తున్నాయి.

చచ్చిన కాంగ్రెస్ కు హోదానే ఆశాకిరణం..
ఇక కాంగ్రెస్ ఏపీలో దాదాపు చచ్చిపోయింది. అందులోని నాయకులు వలసపోయారు. ఉన్న కేవీపీ, ఉండవల్లిలు ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏపీని అడ్డంగా విభజించిన పాపంలో భాగస్వాములై.. ఇప్పుడు బీజేపీ హోదా ఇవ్వడంలేదంటూ కుంటిసాకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఇప్పుడు ఏపీలో హోదా తప్ప మరే విషయం వారికి కనిపించడం లేదు. అయినా వీరిని ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. కేవీపీ రాజ్యసభలో హోదా కోసం పోరాడినా వారికి మైలేజీ వచ్చే పరిస్థితి లేదు.. రాష్ట్ర విభజనతోనే వారి చరిత్ర ఏపీలో ముగిసిపోయింది. ఇప్పుడు ఎంత గొంతు చించుకున్నా చేసిన పాపాన్ని మరిచిపోలేకపోతున్నారు ఏపీ ప్రజలు..

జల్లికట్టు ఉద్యమమే ఏపీకి స్ఫూర్తి..
ఇటీవల సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించింది.. దీనిపై తమిళనాడు రగిలిపోయింది.. ప్రతిపక్ష డీఎంకే సారథ్యంలో తమిళల యువత, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన నిర్వహించారు. దీంతో కేంద్రం ముందుకు వచ్చి జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావడం తమిళల విజయం.. ఈ విజయం ఏపీ ప్రజలకు స్ఫూర్తి దాయకమని పవన్ తన ట్వీట్లతో ఉపదేశం చేశారు.. అదే తోవలో ఏపీ యువత ముందుకువస్తోంది.. జల్లికట్టు లా ప్రత్యేక హోదా కోసం పోరుబాటకు సిద్ధమైంది..

26న ప్రత్యేక హోదాపై విశాఖలో యువత ఉద్యమం..
ఈనెల 26న విశాఖలో కొందరు యువత, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తోడ్పాటుతో ప్రత్యేక హోదాపై పోరాడేందుకు రెడీ అయ్యింది.. జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది విశాఖ ఆర్కే బీచ్ లో మౌనపోరాడానికి యువజన సంఘాలు సిద్ధమయ్యాయి. దీనికి పవన్ , జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉద్యమంతోనైనా ఏపీ ప్రజల్లో, నాయకుల్లో చిత్తశుద్ధి వచ్చి ప్రత్యేక హోదా విషయంలో కదిలిక రావాలని యువత కోరుకుంటోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా, వివిధ మీడియా చానాళ్లలో యువత ఏర్పాటు చేసిన ఈ నిరసనపై ప్రచారం జోరందుకుంది.. ఈ పోరాటం జల్లికట్టులా మారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని ఏపీ ప్రత్యేక హోదాపై కదలిక రావాలని ఆశిద్దాం..

To Top

Send this to a friend