పార్టీ నేతలను కర్నాటక హద్దుల వరకు తరిమితురిమించిన బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కోపమొచ్చింది. హిందూపురంలో తన మాటను లెక్క చేయని సామంత టీడీపీ నాయకులను పోలీసులతో తరిమితురిమించారు. బాలకృష్ణ పీఏ కనుమూరి చంద్రశేఖర్‌ చౌదరి అవినీతి, ఆగడాలను భరించలేక నియోజకవర్గ టీడీపీ నేతలు ఇటీవల తిరుగుబాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం చిలమత్తూరులో సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అయితే సమావేశం నిర్వహించవద్దని తన మనుషుల ద్వారా స్థానిక టీడీపీ నేతలకు ఆదేశాలు పంపారు బాలకృష్ణ. అయినా సరే టీడీపీ నేతలు లెక్క చేయలేదు. ముందు శేఖర్‌ను తొలగించి ఆ తర్వాతే చర్చకు రావాలని తేల్చేశారు.

చిలమత్తూరులో సమావేశం నిర్వహించి తీరుతామని వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ పోలీసుల ద్వారా కథ నడిపేందుకు ప్రయత్నించారు. చిలమత్తూరులో టీడీపీ నేతల సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమావేశం నిర్వహించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వారు పథకం మార్చుకున్నారు. సమావేశాన్ని పక్కనే ఉన్న కర్నాటక సరిహద్దులకు మార్చుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం మేరకు వారంతా శనివారం రాత్రే ఓ వివాహానికి హాజరై అక్కడి నుంచి కర్నాటక టీడీ క్రాస్‌కు చేరుకుని సమావేశాన్ని ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. దీంతో వారు సుంకలమ్మ గుడి వద్దకు చేరారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో టీడీ క్రాస్‌ వద్ద ఉన్న ఒక ఫాంహౌజ్‌లో చివరకు సమావేశం నిర్వహించుకున్నారు. బాలకృష్ణ తమకు ఎమ్మెల్యేగా వస్తే తలరాతలు మారిపోతాయనుకుంటే చివరకు ఇలా పొరుగు రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తోందని పార్టీ నేతలు మండిపడ్డారు. జిల్లాకు చెందిన నేతలైనా జోక్యం చేసుకోవాలని లోకల్ లీడర్లు కోరుతున్నా మ్యాటర్ బాలకృష్ణ నియోజకవర్గానిది కావడంతో అనవసరంగా ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని వారు మౌనంగా ఉంటున్నారు.

To Top

Send this to a friend