పన్నీర్ సెల్వం x శశికళ.. మోడీ ప్లాన్?

వచ్చేశాడు.. ఎట్టకేలకు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ చైన్నై వచ్చారు. 5 రోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠతతో తమిళనాడులో రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఢిల్లీ ఆదేశాలను పాటిస్తూ.. పన్నీర్ సెల్వం నెత్తిన పాలుపోస్తూ.. ఆయన్ను ఎమ్మెల్యేలను లాక్కోవయ్యా బాబు అంటూ పరోక్ష సందేశాలిస్తూ.. ఢిల్లీ రాజకీయాలను పాటించమంటూ.. శశికళను సీఎంను కాకుండా అడ్డుకుంటూ.. సుప్రీం ఆమెను జైలుకు పంపేదాకా వేచిచూస్తూ.. గవర్నర్ విద్యాసాగర్ రావు.. ఎట్టకేలకు మోడీ అనుమతితో చైన్నై వచ్చేశారు?
నాటకీయ పరిణామాలు తమిళనాడులో కొనసాగుతూ వున్నాయి. తమిళ రాజకీయం ఇప్పుడు గవర్నర్ విద్యాసాగర్ రావు చేతిలో ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావు చైన్నైకి రాగానే మొదట ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో భేటి అయ్యి రాష్ట్రంలోని శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అంతే ఓకే అనుకున్నాక మొదట సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వంను కలిశారు. సెల్వం విజయం సంకేతం చూపుతూ బయటకు వచ్చారు. గవర్నర్ నాకు హామీ ఇచ్చాడని బయట విలేకరులతో చెప్పాడు. మరోవైపు శశికళతో సాయంత్రం 7.30కి గవర్నర్ భేటి అయ్యారు. ఆమెకే సమయాన్ని ఎక్కువగా వెచ్చించారు. కానీ శశికళ బయటకు వచ్చి మీడియాకు ఏం చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమెకు అవకాశాన్ని ఇవ్వడం లేదా.. అన్న సందేహాలు వెల్లువెత్తాయి..
శశికళ తన దగ్గర 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ పెద్ద జాబితాను గవర్నర్ కు ఇచ్చిందట. పన్నీర్ సెల్వం కూడా మద్దతుదారుల లేఖతో గవర్నర్ ను కలిసారు. మద్దతివ్వని ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో ఉంచారు. తనకు మద్దతు ప్రకటించేలా ప్రజలు వారిపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
మోడీ ప్లాన్ బెడిసికొట్టేనట్టే కనపడుతోంది.. అన్నాడీఎంకే ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ నేత, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై శశికళ వైపు నిలవడం మోడీ ఆశలపై నీళ్లు చల్లింది. తంబిదురై ఢిల్లీలో మోడీ, వెంకయ్యలతో భేటి అయ్యారు. పన్నీర్ ను సీఎం చేసేందుకు మోడీ చేస్తున్న ప్లానులో భాగస్వాములు అవుతారని అనుకున్నారు. కానీ చైన్నై వచ్చిన తంబిదురై.. శశికళ వెంట నడిచి ఆశ్చర్యపరిచారు. ఆమెతో పాటు గవర్నర్ ను కలవడం.. అన్నీ తానై చూసుకోవడం కనిపించింది. అంతేకాదు పన్నీర్ వెంట కూడా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. మోడీ మద్దతిచ్చినా.. ఇన్ని అవకాశాలిచ్చిన ఎమ్మెల్యేలు ఆయన వెంట నడవడం లేదు. 20లోపే ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారు. మిగతా వారంతా శశికళకే మద్దుతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పాత్ర కీలకం కాబోతోంది. ఇన్నాళ్లు ఢిల్లీ నుంచి గవర్నర్ ను ఆడించిన మోడీకి ఇప్పుడు ఏదో ఒకటి తేల్చాయాల్సిన పరిస్థితి.. అయితే శశికళను సీఎం కాకుండా అడ్డుపడుతున్న కేంద్ర పెద్దలకు ఒక్కటే అవకాశం ముందుంది.. అదే సుప్రీంకోర్టు శశికళ అక్రమాస్తులపై తీర్పు వచ్చే దాకా వేచిచూడడం.. శశికళ దోషిగా తేలి జైలుకు వెళితే.. పన్నీర్ ను సీఎం చేయడం .. అందుకే ఇప్పుడు గవర్నర్ శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరిని కలిసి నివేదిక రూపొందించి కేంద్రానికి పంపుతున్నారట.. సో కేంద్రం ఏంచేస్తుందనేది సస్పెన్స్.

To Top

Send this to a friend