త్యాగశీలివయ్యా పన్నీర్ సెల్వం.. శశికళే సీఎం.

ఒకటి కాదు .. రెండు కాదు గడిచిన ఐదేళ్లలో తమిళనాడు సీఎంగా ఎక్కడం ఆ తరువాత దిగిపోవడం తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వంతైంది.. అమ్మ జయలలిత అంటే ప్రాణమిచ్చే పన్నీర్ సెల్వం.. నమ్మిన బంటుగా ఉండిపోయాడు. జయలలిత తర్వాత రాష్ట్రాన్ని అన్నాడీఎంకే తరఫున పాలించిన ఘనత పన్నీర్ సెల్వందే.. జయలలిత బతికి ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జైలు పాలయ్యారు. జయతో పాటు ఆమె నెచ్చలి శశికళ కూడా జైలు పాలయ్యారు. ఆ సమయంలో అమ్మ చెప్పులను కూర్చీ పై పెట్టి అమ్మ చాటు బిడ్డగా తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టి తమిళలు రాజ్యాన్ని పన్నీర్ ఏలారు. అమ్మ హఠాత్ మరణం అనంతరం పన్నీరే సీఎం అయ్యారు. మొదట్లో జయ నెచ్చలి శశికళ సీఎం పీఠం ఎక్కాలనుకున్నారు. పన్నీర్ అడ్డుపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని శరుణవేడి తన సీఎం పోస్టును కాపాడుకున్నారు. శశికళ అనుయాయులపై ఐటీ దాడులు చేయించారు. అనంతరం చాలా చాకచక్యంగా అడుగులు వేసిన శశికళ.. చివరకు పన్నీర్ సెల్వంతోనే రాజీనామా చేయించి అతడితోనే ప్రతిపాదించుకొని తమిళనాడు సీఎం పీఠం ఎక్కడం సంచలనం రేపింది..
సీఎం పీఠం వదులుకొని శశికళకు ఇచ్చేందుకు మొదట్లో పన్నీర్ సెల్వం నిరాకరించారు. అమ్మ తర్వాత స్థానం తనదే అనుకున్నారు. కానీ శశికళ.. కర్ర విరగకుండా.. పాము చచ్చేటట్టు వేసిన ప్లాన్ తో పాపం పన్నీర్ దిగిరాక తప్పలేదు.. మంత్రులు, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న శశికళ.. పన్నీర్ ను ఒంటరిని చేసింది. చివరకు ఆయనను ఏకాకిని చేసి పన్నీర్ తోనే సీఎం పీఠంపైకి సగర్వంగా చేరుకుంటోంది. ఇలా అమ్మ జయలలితకు, చిన్నమ్మ శశికళను సీఎం చేయడానికి పన్నీర్ తన సీఎం పోస్టును వదులుకుంటూ తమిళనాడులో త్యాగశీలి అనే బిరుదును పొందాడని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు..

To Top

Send this to a friend