తెరాస‌కు ఇక నూక‌లు చెల్లిన‌ట్లేనా?


సింగ‌రేణిలో అత్యంత విలువైన, ప్ర‌భావ‌వంత‌మైన‌ కార్మిక స‌మాజం. తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించిన సింగ‌రేణి కార్మికులు.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. వారస‌త్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని హైకోర్టు కొట్టివేయ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి ముఖం చెల్ల‌డం లేదు.
టీఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం నాయ‌కులైతే.. ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. అమ‌లుకాని హామీలిచ్చి త‌మ‌లో లేని ఆశ‌లు క‌ల్పించి ఇప్పుడు కోర్టు ఆదేశించింద‌ని కాక‌మ్మ క‌థ‌లు చెప్ప‌డంపై కార్మికులు మండిప‌డుతున్నారు.
సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు.. అశ‌నిపాతంలా ప‌రిణ‌మించింది. వార‌స‌త్వ ఉద్యోగాలు దాదాపు 30 వేల కుటుంబాల్లో సంక్రాంతి నింపుతాయంటూ సీఎం ప్ర‌క‌టించడంతో అంతా సంబ‌రాలు చేసుకున్నారు. ఇప్పుడు దాని అమ‌లు రాజ్యాంగ విరుద్ద‌మంటూ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుతో వారి ఇళ్ల‌ల్లో చీక‌ట్లు అలుముకున్నాయి. ఉద్య‌మ స‌మ‌యంలో ఇదే హామీపై కార్మికులు చురుగ్గా పాల్గొని కేంద్రానికి ప్ర‌త్యేక రాష్ట్ర కాంక్ష‌ను ఎలుగెత్తి చాటారు. తీరా తెలంగాణ క‌ల సాకార‌మైంది. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో టీఆర్ ఎస్ వార‌స‌త్వ ఉద్యోగాల అంశాన్ని పెట్టింది.
త్వ‌ర‌లో సింగ‌రేణిలో జ‌ర‌గ‌బోయే కార్మిక‌ సంఘం గుర్తింపు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుంబంధ టీజేబీకేఎస్ గెల‌వాల‌న్న ల‌క్ష్యంతో సీఎం వ్యూహాత్మ‌కంగా అక్టోబ‌రు ప్ర‌క‌టించారు. కానీ, ఎన్నిక‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. ఈలోగా కోర్టు తీర్పు రావ‌డంతో కేసీఆర్ గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ‌ప‌డింది. దీనిపై ఇక కేసీఆర్ ఎంత మొత్తుకున్నా కార్మికులు వినే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.
వాస్త‌వానికి ఈ తీర్పు స‌మంజ‌స‌మైందే! ఇదే అంశంపై గ‌తంలోనూ సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఇవ‌న్నీ కేసీఆర్‌కు తెలియ‌న‌వి కావు. వార‌సత్వ ఉద్యోగాల అంశం అంటే చాలా సున్నిత‌మైంది. సూటిగా చెప్పాలంటే కొరివితో త‌ల‌గోక్కోవ‌డం. ఇప్పుడు ఆ కొరివి మండింది. ఈ మంట‌లు బ‌డ‌బాగ్నిగా మారే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇది కేవ‌లం గుర్తింపు సంఘం ఎన్నిక‌లతోనే ఆగిపోదు. త‌రువాత‌కాలంలో కోల్‌బెల్ట్‌లో టీఆర్ ఎస్ పార్టీ, దాని అనుంబంధ సంఘాల మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థకం చేస్తుంద‌ని స్థానిక నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు.
కేసీఆర్ త‌ల‌పెట్టిన వార‌స‌త్వ ఉద్యోగాల అంశం ఇపుడు అత‌నికి, అత‌ని పార్టీ మెడ‌కు చుట్టుకోవ‌డంతో ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. ఒక‌వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీం గ‌డ‌ప తొక్కినా గ‌త తీర్పునే పున‌రుద్ఘాటించే అవ‌కాశాలే పుష్క‌లం. మొత్తానిక ఏదో అద్భుతం జ‌రిగితేనో.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగితే త‌ప్ప కేసీఆర్ ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

To Top

Send this to a friend