కోట్లు ఖర్చు పెట్టగానే హిట్ లు అయిపోవు..


కొడుకును ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలి. అందుకు ఎంతవరకైనా వెళుతున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేష్.. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. కానీ ఇక్కడే దెబ్బైపోతున్నాడు. చిన్న చిన్న సినిమాలు గ్రాండ్ హిట్ అవుతున్నాయి.. ఉదాహరణకు ‘పెళ్లి చూపులు’ సినిమా ఘనవిజయం సాధించింది.. కోట్లు రాబడి వచ్చింది. ఆ సినిమా ఖర్చు కేవలం లక్షలే.. పెద్ద హీరోలూ లేరు. కొత్త నటులే.. కానీ కథ, కథనం కొత్తది.. దాన్ని తీసిన విధానం బాగుంది. అలాంటి కథలు ఎంచుకుంటే చాలు హిట్ తో పాటు కాసిన్ని డబ్బులు వస్తాయి. కానీ బెల్లంకొండ ఇక్కడే పొరపాటు చేస్తున్నాడు..

బెల్లంకొండ సురేష్ తన కొడుకును ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు వివి వినాయక్ , బోయపాటి శ్రీను లాంటి టాప్ డైరెక్టర్లకు కోట్లు కుమ్మరించి సినిమా తీస్తున్నారు.. సరే బాగుంది అనుకుందాం.. కొడుకు పై ప్రేమతో అలా చేస్తున్నాడనుకుందాం .. కానీ హీరోయిన్ల విషయంలో కూడా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతూ చేతిచమురు వదిలించుకుంటున్నారు. అల్లుడు శ్రీనులో తమన్నాకు ఒక్క ఐటం సాంగ్ కోసం కోటి కుమ్మరించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన కొడుకు తీస్తున్న తరువాతి సినిమా కోసం ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న కీర్తి సురేష్ కు కోటి రూపాయలు ఆఫర్ చేసి సినిమాకు ఒప్పించారు. కీర్తి ఈమధ్యే వరుస హిట్ లు అందుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ సరసన కూడా అవకాశం దక్కించుకుంది. దీంతో బెల్లంకొండ ఈ అమ్మాయిని సినిమాలో ఒప్పించేందుకు అరకోటి వరకు ఉన్న కీర్తి పారితోషకంను కోటి ఇస్తానని డేట్లు ఓకే చేయించుకున్నారట.. అంత పెద్ద మొత్తం అయ్యేసరికి అన్నీ డేట్లు అడ్జెస్ట్ చేసి మరీ ఇచ్చిందట కీర్తి. అలా కొడుకు కోసం కోట్లు తగలేస్తున్న బెల్లంకొండ ఆ సినిమాల్లో కథ కోసం కూడా కొంచెం శ్రద్ధపెడితే మంచిది.. లేకుంటే ఉన్నవి పోతాయి.. ఉంచుకున్నవి పోతాయి జాగ్రత్త..

ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను సినిమా ఒకటి ఓకే అయ్యింది. ఇందులో హీరోయిన్ గా కీర్తి ఎంపికైంది. ఆమెకు కోటి పారితోషికం ఇస్తున్నారట.. దానికంటే ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తారు. ఈ రెండు సినిమాలకు బెల్లంకొండ సురేష్ కోట్లు ఖర్చు చేస్తున్నారు. మంచి కథ, కథనం చూడకుండా అగ్రదర్శకుల మీద ఆధారపడి బెల్లంకొండ సురేష్ చేస్తున్న ఈ సినిమాలు హిట్ అవుతాయో లేదో తొందరలోనే తేలుతుంది.

To Top

Send this to a friend