ఉన్నది పాయే.. పన్నీర్ కంట కన్నీరు..


‘బీజేపీ మాయలోపడి ఎంత పనిచేశాను’ అంటూ ఇప్పుడు పన్నీరు కుమిలికుమిలి ఏడుస్తున్నాడు. అవును రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం.. అది లేకే పన్నీరు కంట కన్నీరు వస్తోంది. కొంచెం ఓపిక పడితే.. చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా పోకపోతే.. ఆమె జైలుకెళ్లేదాకా ఊరుకుంటే.. ఇప్పుడు తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వమే ఉండేవారు. బీజేపీ తోడ్పాటుతో రెచ్చిపోయి.. తమిళ రాజకీయాలను రొచ్చు రొచ్చు చేసిన పన్నీర్ కు ఇప్పుడు తత్వం బోదపడింది. అధికారం దూరమైంది. రాజకీయాల్లో ఏకాకి అయిపోయాడు. పన్నీర్ వెంట నడిచిన ఆ పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అన్నాడీఎంకే అధికారపక్షం వెంట చేరి పన్నీర్ ను ఒంటరిని చేశారు. ఇది అంతా స్వయంకృతాపరాధం..
పన్నీర్ సెల్వం కు ఓ రోజు అర్థరాత్రి వచ్చిన కలను నిజం చేద్దామనుకున్నాడు. అమ్మ జయలలిత ఆజ్ఞాపించిందంటూ శశికళను సీఎం చేయవద్దన్నాడు. పన్నీరే సీఎం కావాలని అమ్మ కోరిందని జయ సమాధి ముందు వచ్చి బోరుమన్నాడు. మీడియా హైలెట్ చేసింది. శశికళకు అక్రమాస్తుల కేసు వెంటాడింది. సుప్రీం తీర్పు కు ముందే శశికళ, పన్నీర్ సీఎం సీటు కోసం కొట్టుకున్నారు. చివరకు సుప్రీం తీర్పుతో శశి జైలు పాలు కావడం.. కొత్తగా పన్నీర్ తర్వాత అన్నాడీఎంకే లో సీనియర్ అయిన ఫళని స్వామి సీఎం కావడం జరిగిపోయాయి. ఈ మొత్తం ఉదంతంలో బీజేపీ బలంతో తిరుగుబావుట ఎగురవేసిన పన్నీర్ సెల్వం నవ్వులపాలు అయ్యారు. అటు అధికారం దక్కక.. ఇటు పార్టీలో చోటు కోల్పోయి రోడ్డునపడ్డారు. శశికళ జైలు కెళితే తానే సీఎం అన్న చిన్నపాయింట్ ను మరిచిపోయి చేజేతులారా చెప్పుడు మాట విని పన్నీర్ దెబ్బై పోయాడు.

To Top

Send this to a friend