వైఎస్ఆర్ ‘బాట’నే ఎంచుకున్న జగన్.

ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే.. అందుకోసం సామధాన బేద దండోపాయాలను ప్రయోగించేందుకు ప్రతిపక్ష నేత జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు తప్పనిసరిగా మారింది. ఓ వైపు అధికార టీడీపీ ఉంటే.. మరో వైపు పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకొస్తున్నారు. వీరిద్దరికి తోడు బీజేపీ చాపకింద నీరులా ఉంది. దీంతో ఇప్పటికే 5 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న జగన్ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు తలిసింది.

 

ఈ శీతాకాలం నుంచి లేదా వచ్చే 2018 జనవరి నుంచి జగన్ జనంలోకి వెళుతున్నారు. ఏపీ రాష్ట్రమంతా పాదయాత్ర ద్వారా చుట్టి రావాలని ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దాదాపు 9 ఏళ్లు అప్రతిహతంగా పాలించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇదే పాదయాత్రతో ప్రజల అభిమానం చూరగొని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్లపాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ను అధికారంలో ఉంచారు. ఇప్పుడు తండ్రి చూపిన బాటలోనే తనయుడు పాదయాత్రకు పూనుకుంటాడనే వార్త ఏపీలో సంచలనంగా మారింది.

గత ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.. రాజకీయాల్లో పాదయాత్రకు చాలా బలం ఉంది. దేశంలో ఎంతో మంది నాయకులు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో బ్రహ్మాస్త్రం లాంటి ఈ పాదయాత్ర అస్త్రాన్ని 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రయోగించబోతున్నట్టు తెలిసింది. అధికారమే లక్ష్యంగా జగన్ ఈ సంవత్సరం చివర కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ పాదయాత్ర చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

To Top

Send this to a friend