జగన్ పాదయాత్ర ఇప్పుడే ఎందుకంటే…

పాత అస్త్రమే.. కానీ పవర్ ఫుల్.. అది చేసినవారందరూ అధికారంలోకి వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత చంద్రబాబులకు అది వరమైంది. ఇప్పుడు అదే బ్రాహ్మస్త్రాన్ని జగన్ .. చంద్రబాబుపై సంధిస్తున్నారు. అదే.. ‘పాదయాత్ర’. పాదయాత్ర చేసిన నాయకులందరూ తర్వాతి ఎన్నికల్లో గెలిచి సీఎంలు అయ్యారు. ఇప్పుడు జగన్ వైసీపీ ప్లీనరీ సాక్షిగా అక్టోబర్ 27 నుంచి ఏపీలో పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించి ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు.

జగన్ లో చాలా మార్పు వచ్చింది. గడిచిన ఎన్నికల్లో ఎవ్వరూ చెప్పినా వినకుండా మొండిగా వెళ్లి దెబ్బైపోయాడు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండిపోయారు. కానీ అప్పటికే 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు.. అలివికానివి.. అమలుకష్టమైన హామీలను సైతం ప్రకటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇందులో రైతు రుణమాఫీ కీలకమైంది. జగన్ ఈ పథకాన్ని ప్రకటించలేదు. చంద్రబాబు ప్రకటించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక డక్కా మొక్కీలు తిని సగం అమలు చేసి.. సగం అమలు చేయకపోయినా సరే అధికారమైతే చంద్రబాబుకు దక్కింది. జగన్ కు ఆశాభంగం కలిగింది. అందుకే ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు 9 పథకాలు ప్రకటించి జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలను అవపోసన పట్టారు. మోడీ దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని అసెంబ్లీలను రద్దు చేసి మజీలీ ఎన్నికలను 2018లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ఎన్నికల వల్ల ప్రజాధనం.. పథకాల ప్రకటనలో జాప్యం, ఎన్నికల కోడ్ తదితర కారణాలతో మోడీ ‘ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు’ అనే చట్టం తేవబోతున్నారు. అందుకే ఎన్నికలకు రెండేళ్లు ఉన్నా కూడా జగన్ తొందరగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకవేళ 2018లోనే ఎన్నికలు వస్తే ఆరు నెలలే సమయం ఉండడంతో జగన్ కు పాదయాత్ర వల్ల లబ్ధి పొంది అధికారం దక్కుతుంది. 2019లో వచ్చినా ఏడాదిలో ప్రచారాన్ని ముమ్మరం చేయవచ్చు. ఇలా పీకే సూచనలతో జగన్ ఎన్నికలకు రెండేళ్ల ముందే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

To Top

Send this to a friend