అవును.. చిరు కోసం ముగ్గురు


మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ 150వ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూశారో ఇప్పుడు అదే విధంగా ఆయన 151వ చిత్రం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా చిరు కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఏమాత్రం నిరుత్సాహ పర్చకుండా దర్శకుడు సురేందర్‌ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి కావస్తుంది.

ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లుగా ఇప్పటికే చరణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు అంటూ కొన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ చిత్రంలో హీరోయిన్స్‌ కన్ఫర్మ్‌ అయ్యారు. చిరంజీవికి జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు ఐశ్వర్య రాయ్‌, అనుష్క, నయనతారలు నటించబోతున్నారు. కథానుసారంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ కావాల్సి ఉందట. అందుకే ముగ్గురిని ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్‌ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనుందని, అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక నయనతార మరియు అనుష్కలు కీ రోల్‌లో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా చిరుతో నటించేందుకు సైన్‌ చేశారు. చిత్రం ప్రారంభ సమయంలో ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. సినిమా స్థాయిని పెంచేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ను ఎంపిక చేసిన యూనిట్‌ సభ్యులు సంగీతం కోసం ఏఆర్‌ రహమాన్‌తో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి సినిమాను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా భారీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో భారీగా చరణ్‌ అండ్‌ టీం ప్లాన్‌ చేస్తున్నారు.

To Top

Send this to a friend