పాము పగ పట్టి చంపేసిందా.?

మందమర్రిలో ఆయన మరణ వార్త విని కార్మిక కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. మందమర్రి ఏరియాలోని సింగరేణి సివిల్‌ విభాగంలో జనరల్‌ మజ్దూర్‌గా పని చేసే అనవేన శ్రీనివాస్‌ అలియాస్‌ పాముల శ్రీనివాస్‌ ఈ నెల 24న స్థానిక సింగరేణి గ్రీన్‌ పార్కులో హరితహారం కోసం మొక్కలు తీస్తూ అందులో ఉన్న రక్త పింజర పాము కాటుకు గురై కరీంనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య కృష్ణవేణి, కూతుళ్లు స్వాతి, అంజలి సంతానం. స్థానిక మొదటి జోన్‌లో శ్రీనివాస్‌ కుటుంబం నివాసముంటుంది.

సింగరేణి ప్రాంతాల్లో ఎక్కడ పాము కనిపించినా మీకు భయం లేదంటూ నిమిషాల్లో ప్రత్యక్షమయ్యేవాడు. ఎంత విషపూరితమైన పామునైనా ఇట్టే పట్టేసి అడవిలో వదిలేవాడు. పాములు పట్టడంలో దిట్టగా పేరున్న శ్రీనివాస్‌ను సింగరేణి యాజమాన్యం సైతం సింగరేణి ప్రాంతంలో, కార్మికుల గృహాలు, గనులు, విభాగాల కార్యాలయాల్లో సంచరించే పాములను పట్టుకునే పనిలో నియమించింది. కొంత కాలంగా ఆయన ఏరియా పర్యావరణ విభాగం పరిధిలో స్థానిక సింగరేణి గ్రీన్‌ పార్కులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న మధ్యాహ్నం సమయంలో పార్కులో విధులు నిర్వహిస్తుండగా రక్త పింజర కాటు వేసింది. వెంటనే చికిత్స కోసం రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులతో తనను కాటువేసి పాము గురించి సైతం చెప్పాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం రాత్రి 11 గంటల వరకు శ్రీనివాస్‌ ఆసుపత్రిలో ఉంచుకున్న తర్వాత కార్మికుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రీఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. గని ప్రమాదంగానే పరిగణించి ఆయనకు న్యాయం చేయాలని కోరారు. గురువారం వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు కన్నీటి నివాళులు అర్పించారు.

పది సంవత్సరాల కాలంలో వేలాది పాములను పట్టుకున్నాడు. ఎక్కడా డబ్బులు తీసుకునే వాడు కాదు. కేవలం పెట్రోల్‌ ఛార్జీలను మాత్రమే తీసుకునే వాడు. తనకు తెలిసిన విద్యను పది మందికి పంచాలనే ఉద్దేశంతో స్నేక్‌ సొసైటీని ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాల్లోని పలువురు యువకులకు శిక్షణ సైతం ఇచ్చారు. ఖమ్మంలో దిండులో చేరిన పాము కుటుంబంలోని నలుగురు వ్యక్తులను కాటు వేయడంతో వారంత మృతిచెందిన సంఘటన శ్రీనివాస్‌లో పాములు పట్టాలనే సంకల్పానికి కారణమైంది.

To Top

Send this to a friend