భార్య ప్రొఫైల్ పిక్..


అనుమానమే పెనుభూతమైంది. భార్య వ్యవహారశైలి ఆ భర్తకు నచ్చలేదు. అందుకే ప్రాణ స్నేహితుడు-భార్య ను తప్పుగా అర్థం చేసుకొని ఉసురు తీసుకున్నాడు బుల్లితెర నటుడు ప్రదీప్.. ప్రస్తుతం తెలుగు టీవీ సీరియల్స్ లో ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ప్రదీప్ మరణాన్ని తొలుత హత్య గా భావించిన పోలీసులు ఆయన భార్య పావనీ రెడ్డి, ప్రదీప్ స్నేహితుడు శ్రావణ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్యగా నే తేలడంతో ఇద్దరిని వదిలేశారు.

విశాఖ పట్నానికి చెందిన ప్రదీప్, హైదరాబాద్ లో నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలోనే పావనీ రెడ్డితో పరిచయమైంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రదీప్ తన బెస్ట్ ఫ్రెండ్ ను సాయం కోరాడు. ఖతార్ లో ఉంటున్న శ్రావణ్ అక్కడి నుంచి వచ్చి ప్రదీప్-పావనీ పెళ్లి చేసి ఓ ఫ్లాట్ లో కాపురం పెట్టించాడు. ప్రస్తుతం శ్రావణ్ కూడా వీరిద్దరితోనే ఉంటున్నాడు.

అయితే శ్రావణ్ పుట్టిన రోజు వేడుకే ప్రదీప్ మరణానికి కారణమైంది. శ్రవణ్ పుట్టినరోజును ప్రదీప్ తన ఫ్లాట్ లో ఘనంగా నిర్వహించాడు. అతిథులందరూ వెళ్లిపోయాక భార్యభర్తల మధ్య స్వల్ప గొడవ జరిగింది. ప్రదీప్ భార్య పావనీ.. శ్రావణ్ తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా అకౌంట్ లో ప్రొఫైల్ పిక్ గా పెట్టడం ప్రదీప్ కు నచ్చలేదు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో తన బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు మూసుకున్న ప్రదీప్ చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారి భార్య పావనీ తలుపు కొట్టినా తెరువకపోవడంతో కిటీకీలోంచి చూడగా ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టమైంది. ఒక చిన్న పాటి అనుమానం, అసూయ ఒక బుల్లితెర నటుడి జీవితాన్ని ఇలా అర్థాంతరంగా చిదిమేయడం విషాధాంతమైంది.

To Top

Send this to a friend